అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజులు కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
బుధవారం (06-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం (07-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం (08-05-26) ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో(03) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నంద్యాల(జి) బనగానపల్లిలో 43°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.7°C, ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 42.3°C, మార్కాపురం(జి) కంభంలో 42.2°C, వైఎస్సార్ కడప(జి) పులివెందులలో 42°C, తిరుపతి(జి) వెంటగిరిలో 41.9°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.5°C,ప్రకాశం(జి) కొప్పెరపాడు లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 9 జిల్లాల పరిధిలోని 45 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
Prajavartha Online Telugu News