Breaking News

బందరు చరిత్ర తిరగరాసేలా అభివృద్ధి చేసి చూపిస్తా

– తాగునీటి పైపులైన్లు, DWM రోడ్డు పనులకు శంకుస్థాపన
– బందరులోని ప్రతి ప్రాంతానికీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు
– ఆరోపణలు, విమర్శలు తప్ప పేర్నినానికి బందరు అభివృద్ధి పట్టదు
– అధికారుల్ని బెదిరిస్తా, అభివృద్ధిని అడ్డుకుంటానంటే తొక్కి పడేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చి చూపించే బాధ్యత నాది అంటూ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు రింగ్ రోడ్డు నుండి కొత్త కాలనీ వరకు 800 మీటర్ల తాగునీటి పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉల్లింగపాలెంలో DWM డబుల్ బీమ్ రోడ్డు పనులకు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావుగారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గతంలో రోడ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతలు లేని మచిలీపట్నాన్ని సాకారం చేశాం. తాగునీటి సమస్యలు పరిష్కారం లక్ష్యంగా రూ.28 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించాం. మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాలకు తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. రూ.73 కోట్ల అమృత్ పథకం నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ పనులను పూర్తి చేస్తాం. త్వరలో రూ.13 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయబోతున్నాం. ఎస్టీపీలు కూడా ఏర్పాటు చేస్తాం. మచిలీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతాం. 15వ ఆర్ధిక సంఘం నుండి కూడా నిధులు వచ్చాయి. వాటితో ఏమేం పనులు చేయాలో చర్చించి ప్రణాళిక రూపొందిస్తాం.

గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రభుత్వం నుండి రూపాయి కూడా తీసుకురాలేకపోయారు. 15 సంవత్సరాలు మున్సిపాలిటీని పాలించినప్పటికీ పైసా అభివృద్ధి చేయలేదు. అలాంటి వారు కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎంపీగా పని చేసిన కొనకళ్ల నారాయణ రావు గారు, ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి గారి కృషితో కేంద్రం నిధులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తున్నాను.

ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో ఇనుము దొంగిలించేశారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఆధారాలు చూపించమంటే తేలుకుట్టిన దొంగల్లా పారిపోతున్నారు. మార్కెట్ యార్డులో పెట్టిన ఇనుము పాడైపోతుంటే దాన్ని వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకుంటే తప్పా? తప్పు జరిగినట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేయాలి. అంతే గానీ అధికారుల అంతు చూస్తానని బెదిరించడం దుర్మార్గం. 2014-19 మధ్య పేదల కోసం కట్టిన టిడ్కో ఇళ్లను గత ఐదేళ్లు లబ్దిదారులకు అందించకుండా పాడుబెట్టారు. కరగ్రహారంలో లే అవుట్ పేరుతో వైసీపీ నాయకులతో పేదల భూముల్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయించి, వాటిని ప్రభుత్వానికి అధిక ధరలకు కట్టబెట్టి జేబులు నింపుకున్నారు. ఇల్లు కట్టుకోవడానికి కనీసం పనికిరాని ప్రాంతంలో భూ కేటాయింపుల పేరుతో దోచుకున్నారు. ఏదో చేసేశాం. ఉద్దరించేశామని చెప్పే పేర్నినాని, జగన్ రెడ్డి ఆ లే అవుట్లలో రోడ్లుగానీ, తాగునీటి సదుపాయాలు గానీ ఎందుకు ఏర్పాటు చేయలేదో సమాధానం చెప్పాలి.

పేర్ని నాని రోజూ మీడియా ముందుకొచ్చి చెత్త ఆరోపణలు చేయడం తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కోసం కనీసం ఆలోచించిన దాఖలాల్లేవు. మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించడం, అధికారుల్ని బెదిరిస్తామంటే ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ గారు, మోటమర్రి బాబాప్రసాద్ గారు, గొర్రెపాటి గోపీచంద్, లోగిశెట్టి స్వామి తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *