విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీసీపీడీసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి బుధవారం అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు (SEలు), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEలు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ…
వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించాలని, రెవెన్యూ వసూళ్లు 100 శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఫీడర్లను ఎటువంటి బ్రేక్డౌన్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బిల్లింగ్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని, నూతనంగా నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ల పనుల పురోగతిని వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా, WhatsApp Governance సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సేవలు మెరుగుపడుతున్నాయని, మూడు ప్రశ్నల ఆధారంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీసీపీడీసిఎల్కు 78.1 శాతం సానుకూల స్పందన లభించిందని తెలిపారు. ఈ శాతాన్ని 90 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే RDSS పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ టి.వి.ఎస్.ఎన్. మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News