– వినియోగ సామగ్రిలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రాధాన్యం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ్ఞప్తిపై గౌరవ సీఎం సానుకూల స్పందన
– అధికారిక ఆదేశాలకు గ్రీన్ సిగ్నల్, ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్
– ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందడుగు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక స్వావలంబనకు మరింత ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే కార్యాలయ వినియోగ సామగ్రిని స్వయం సహాయ సంఘాల నుంచి సేకరించే విధానం అమలుకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన అధికారిక మార్గదర్శకాలు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
కలెక్టర్ల సదస్సు రెండో రోజు శుక్రవారం నాటి సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీగా ఉపయోగించే ఫైళ్లు, పెన్నులు, పెన్సిళ్లు, పేపర్లు, ఇతర కార్యాలయ వినియోగ వస్తువులను స్వయం సహాయ సంఘాల నుంచి సేకరిస్తే మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించేలా తగిన అధికారిక మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎస్‌కు సూచించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ నిర్ణయం మహిళా ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక ముందడుగుగా నిలుస్తుందన్నారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎంకు కలెక్టర్ లక్ష్మీశ ధన్యవాదాలు తెలిపారు.
రైజ్‌తో ఎస్‌హెచ్‌జీలకు కొత్త దిశదశ
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసేలా, స్వయం ఉపాధి దిశగా నడిపించేలా కృషిచేస్తున్నారు. ఇందుకు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ప్రత్యేకంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. వివిధ రకాల ఉత్పత్తులు, సేవలపై మహిళలకు వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల తయారీ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు మరింత ఆదరణ పెరిగేలా, చేయూతనిచ్చేలా తాజాగా కలెక్టర్ లక్ష్మీశ.. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News