ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల కార్యక్రమం

-రేపు తుమ్మలపల్లి కళా క్షత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కార్యక్రమం
-విశ్వసనీయతకు మారుపేరు ఆకాశవాణి – నేటి తరానికీ స్ఫూర్తిదాయకం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారని అందులో భాగంగా ఆకాశవాణి రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎమ్. సోమేశ్వరరావు, ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి జి. దివ్య, న్యూస్ విభాగాధిపతి టి. హెన్రీ రాజ్ లు శనివారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎమ్. సోమేశ్వరరావు మాట్లాడుతూ … తొమ్మిది దశాబ్దాలుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమాజంలోని ప్రతి వర్గానికి చేరువవుతూ విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. కళాకారులకు నిలయంగా, రైతులకు నేస్తంగా, యువతకు స్నేహితుడిగా నిలుస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఎం.బాలమురళీకృష్ణ, కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, కొంగర జగ్గయ్య వంటి దిగ్గజాలు తమ ప్రయాణాన్ని సాగించారన్నారు. విద్య, వ్యవసాయం, సాహిత్యం, సంగీత, సాంస్కృతిక రంగాల్లో విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఈ కేంద్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఆకాశవాణి కేవలం వార్తలకే పరిమితం కాకుండా కథలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్న రీతిలో ప్రజలకు అందిస్తోందన్నారు. పాత తరం నుండి నేటి తరం వరకు అందరికీ చేరువయ్యేలా తన ప్రసార పద్ధతులను మార్చుకుంటూ, ప్రస్తుతం డిజిటల్ మోడ్‌లో కూడా ప్రసారాలను కొనసాగిస్తోంది. భారతదేశంలో సుమారు 585 స్టేషన్లతో, 92.5% ప్రజలకు మరియు 99.17% భౌగోళిక ప్రాంతానికి ఆకాశవాణి తన సేవలను విస్తరించిందన్నారు. ఆకాశవాణి అందించే వార్తలు అత్యంత వాస్తవమైనవని, నమ్మదగినవిగా గుర్తింపు పొందాయన్నారు. 1936లో మొదటి రేడియో స్టేషన్ ప్రారంభమైందని ఎమ్. సోమేశ్వరరావు పేర్కొన్నారు.

ప్రాగ్రామ్ విభాగాధిపతి గుడుపూడి దివ్య మాట్లాడుతూ… ప్రస్తుతం ఆకాశవాణి 90వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు, జూన్ 8, 2025 నుండి జూన్ 8, 2026 వరకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మే 10 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీ, గరగ నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలకు మే 10న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుమతులు అందిస్తామన్నారు. మే 19 ఉదయం 6:30 గంటలకు నగరంలో ప్రత్యేక వాకథాన్ నిర్వహిస్తున్నామన్నారు. వాస్తవమైన వార్తలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి ఆకాశవాణి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి హెన్రీ రాజ్ మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా, ఆకాశవాణి (All India Radio) తన విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల హడావిడిలో నేటి తరానికి ఆకాశవాణి విశిష్టతపై అవగాహన తగ్గుతోందని, దాని ప్రాముఖ్యతను చాటిచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన కోరారు. ఒకప్పుడు గడియారాల్లో సమయాన్ని సరిచేసుకోవడానికి ఆకాశవాణి సమయాన్నే అందరూ ప్రామాణికంగా భావించేవారని, ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. టీఆర్పీ (TRP) రేటింగ్‌ల కోసం కాకుండా, అత్యంత జెన్యూన్‌గా, వాస్తవ ఆధారిత వార్తలను అందించడమే ఆకాశవాణి ప్రత్యేకతన్నారు. ప్రస్తుత కాలంలో రేడియో సెట్లు అందుబాటులో లేకపోయినా, న్యూస్ ఎయిర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వార్తలు, చర్చా కార్యక్రమాలు వినవచ్చన్నారు. ఆకాశవాణి సంకేతాలు అంతర్జాతీయ స్థాయిలో యూరప్ దేశాల్లో అందుతున్నాయని, ఇటీవల బెల్జియం నుండి వచ్చిన స్పందనే దీనికి నిదర్శనమని హెన్రీ రాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆకాశవాణి రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎమ్. సోమేశ్వరరావు, ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి జి. దివ్య, న్యూస్ విభాగాధిపతి టి. హెన్రీ రాజ్ లు స్వర సంధ్య (కల్చరల్ కార్యక్రమాల) పోస్టర్ ను ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *