– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు
– వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
– వ్యవసాయ,సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార శాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది వివిధ కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. ఫణి పేర్రాజు నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పదోన్నతులు పొందిన ఉద్యోగులు విజయవాడలో వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాల మేరకు పదోన్నతులు త్వరితగతిన మంజూరు చేయడమే కాకుండా, పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసినందుకు ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ప్రమోషన్లు పొందిన ఉద్యోగుల అభ్యర్థన మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడమే కాకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, వారి హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే సహకార శాఖలో వివిధ కేడర్ల ఉద్యోగులకు జారీ చేసిన ప్రమోషన్లలో 100 శాతం పారదర్శకత పాటించామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. ఫణి పేర్రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో సహకార శాఖలో వివిధ కేడర్లలో దాదాపు 350కు పైగా ప్రమోషన్లు కల్పించబడినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైందన్నారు. అలాగే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాలతో ప్రమోషన్లు, పోస్టింగులు అత్యంత పారదర్శకంగా అమలయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జీసీబీవీ కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు డి. విజయ్ కుమార్, పి. రాజశేఖర్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి. సందీప్, సహా అధ్యక్షుడు యు. రమేష్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు వై. యేసు కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎస్. భావనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News