-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణనలో ఖచ్చితత్వం, వేగం రెండూ అవసరం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని సీతారాంపురం, సత్యనారాయణపురం, దుర్గాపురం, మాచవరం, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి జరుగుతున్న జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన నిర్వహణలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని జనగణన సంఖ్యను గణనీయంగా పెంచాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలను సేకరించడంలో శ్రద్ధ వహించాలని, జనగణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, వివిధ శాఖల అధిపతులు తమ పరిధిలోని సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ప్రతిరోజూ కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నారా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ నిర్దేశించిన సంఖ్యలో జనగణన పూర్తి అయ్యేలా సమీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, జోనల్ కమిషనర్లు కె. షమ్మీ, కె. ప్రభుదాస్, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News