-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు.
మున్సిపల్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పురమిత్ర యాప్ లో స్వీకరించిన ఫిర్యాదులను, అధికారులు పరిష్కరించిన తీరును సమీక్షించారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 9, ఇంజనీరింగ్ 5, రెవిన్యూ 1, పబ్లిక్ హెల్త్ 2, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 18 ఫిర్యాదులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, ప్రభాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News