Breaking News

జాతీయ స్థాయిలో విఎంసి వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానంపై ప్రదర్శన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో విఎంసి వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానంపై ప్రదర్శన ఇవ్వనున్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో శాఖాధిపతులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ స్థాయి సమావేశంలో వివిధ నగర పాలక సంస్థల కమిషనర్లు సమర్పించాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నగరాల్లో అమలు చేస్తున్న పారిశుధ్య నిర్వహణ, వ్యర్థ పదార్థాల శాస్త్రీయ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలు, సుస్థిర పట్టణ అభివృద్ధి వంటి అంశాలపై ప్రదర్శనలు ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది.

అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ ధ్యానచంద్ర నగరంలో అమలు చేస్తున్న సమగ్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానం, చెత్త సేకరణలో ఆధునిక సాంకేతికత వినియోగం, మూలస్థాయిలోనే చెత్త వర్గీకరణ, రీసైక్లింగ్ విధానాలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు.

విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛత, పారిశుధ్య రంగాల్లో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇతర స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన స్థానిక సంస్థలు తమ ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా పారిశుధ్య ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, ప్రభాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *