Breaking News

ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ

-ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమం
-ప్రజారోగ్యానికి సంజీవని ప్రాజెక్టు
-ఆరోగ్యంగా ఉన్న ప్రజలే సమాజానికి నిజమైన సంపద
-గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం- నెవర్ అగైన్
-నోరు తెరిస్తే అబద్ధం-మీడియా ముందు మంచోడిగా డ్రామాలు
-పూతలపట్టులో సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

పూతలపట్టు/చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనికోసం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రాజెక్టు ఏపీ వ్యాప్తంగా అమలు అవుతుందని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సంజీవని కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదని, ఇది ఓ సమగ్ర డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తోందని సీఎం స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సిటిజెన్ వెల్ నెస్ మిషన్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరెటివ్ అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థ పని చేస్తుందని సీఎం అన్నారు. ముందస్తుగా గుర్తించటం, వ్యాధి రాకముందే నివారణ, చికిత్సల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను వైద్యులు నిరంతరం పర్యవేక్షించేలా ఈ వ్యవస్థ సేవలందిస్తుందని వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమం… ఈ ఏడాది మార్చి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉందని…. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజారోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజెక్టు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. డాక్టర్ అప్పాయింట్మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షిస్తామని వివరించారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్య సేవలు పొందేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

వైద్యరంగానికి ఎక్కువ నిధులు

వైద్య ఖర్చులు భరించలేక కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయాయని, ఆ ఇబ్బందులను తప్పించడానికే ప్రజా ప్రభుత్వం సంజీవనిలాంటి వినూత్న ప్రాజెక్టు తీసుకువచ్చిందని అన్నారు. రాష్ట్రంలో విద్య-వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ఉద్యమం చేపట్టామని అన్నారు. ఈసారి బడ్జెట్ లో వైద్యారోగ్య రంగానికి రూ.19,305 కోట్లు కేటాయించినట్టు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా రూ.2,601 కోట్ల ఆరోగ్య గ్రాంట్లు పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలో పేదా ధనికా తేడా లేకుండా ప్రతీ ఒకొక్కరికి రూ. 2.50 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తామన్నారు. రూ. 25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ద్వారా వైద్య ఖర్చులు భరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పేదలకు సైతం మెరుగైన వైద్యం అందించేందుకు… ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నామని వివరించారు. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆహారమే ఔషధం – వంటశాలే ఔషధ శాల అని మరోమారు సీఎం స్పష్టం చేశారు. ప్రజారోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.

శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వరకూ కృష్ణా నీరు

సమాజంలో ప్రతీ ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించటంతో పాటు ప్రతీ నీటి బొట్టునూ సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సమర్ధ నీటి నిర్వహణ ద్వారా జలనవరుల్ని కాపాడుతున్నామని… భూగర్భ జలాలు కూడా పెంచగలిగామని తెలిపారు. సముద్రంలో వృధాగా పోయే జలాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింటినీ నింపగలిగామని వివరించారు. హంద్రీ-నీవా కాలువతో రాయలసీమ జిల్లాల్లోని చివరి ప్రాంతాలకు నీరు తీసుకెళ్లామని అన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయని, ఈ కారణంగానే అక్కడ పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయని సీఎం అన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదు అవుతున్నాయని పిడుగురాళ్లలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని అన్నారు. వర్షపాతం తక్కువ కురుస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసే సంకల్పంతో ఉన్నామని దీనిపై ఇప్పటికే క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. నీవా పనులు పూర్తి చేసి పూతలపట్టు మీదుగా చిత్తూరు వరకు కృష్ణా నీటిని తీసుకు వస్తామన్నారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వరకూ నీటిని తరలిస్తామని చెప్పారు. గాలేరు-నగరి కోడూరు వరకు, మల్లె మడుగు బాలాజీ రిజర్వాయర్- 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. సోమశిల, స్వర్ణముఖి లింక్ కెనాల్-జూన్ 2028 పూర్తి అవుతుందన్నారు.

రాయలసీమ ఇక ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం

23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని… రాష్ట్రంలోని 23 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమలోని పుట్టపర్తిలో 5 జనరేషన్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని… యుద్ధాల్లో పాల్గొనే జెట్ ఫైటర్ యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా పుట్టపర్తి మారబోతోందని సీఎం అన్నారు. రాయలసీమను డిఫెన్స్ హబ్ గా చేస్తామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కర్నూలులో డ్రోన్, అనంతపురంలో ఏరోస్పేస్, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ లాంటివి ఏర్పాటు కానున్నాయని వివరించారు. తిరుపతిలోనే త్వరలోనే బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందన్నారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ, సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు వచ్చే నెల కర్నూలో బంగారం ఉత్పత్తి చేసే గనుల్ని కూడా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు. రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్లు, రూ. 60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత, పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినా… సమస్య తాత్కాలికమేనని అన్నారు. మహిళల కోసం కూటమి సర్కారు తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2 లాంటి పధకాలు అమలు చేసిందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ తో పాటు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

గొడ్డలి పార్టీ గంగవెర్రులెత్తుతోంది

రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావటంతో పాటు కూటమి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను చూసి గొడ్డలి పార్టీ గంగవెర్రులెత్తుతోందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు ప్రజల్ని భయపెట్టే మోసం చేసే రాజకీయాలు ఇంకోవైపు ఉన్నాయని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని అన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు మీడియా ముందుకొచ్చి మంచోడినంటూ మాటలు చెబుతున్నారని.. ఇది గొడ్డలి పార్టీ నైజమని అన్నారు. వైసీపీ చేసిన 11 నిర్వాకాలను, అరాచక ఘటనలను సీఎం ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదని..సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఆంశాలపై సీఎం మాట్లాడుతూ.. 1.వివేకా హత్యలో నాటకాలు ఆడారు, నంగనాచి కబుర్లు చెప్పారు – అంతిమ లబ్దిదారు ఎవరనేది…ప్రతి ఒక్కరికీ తెలుసు. 2.కోడికత్తి డ్రామా… గులకరాయి డ్రామా ప్రజలందరికీ జ్ఞాపకం ఉంది. ప్రజలను మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. 3.దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ చేసిన నిందితుడికి అండదండలు ఇచ్చారు. 4.మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ పై పై దాడి చేశారు, వేధించి ప్రాణాలు తీశారు. 5.కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు వేశారు. ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం చేశారు. ఇంట్లో న్యాయం చేయకుండా బయట ఎలా న్యాయం చేస్తాడు. 6. హిందూ దేవుళ్లపై దాడులు చేశారు. అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు. తప్పుడు ప్రచారాలు చేశారు. 7. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు వేసింది. 8.నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసి నడిరోడ్డుపై చంపేసి రక్తదాహం తీర్చుకున్నారు. 9.గంజాయి బ్యాచ్ లకు ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ల కార్యకర్తలు రప్పా రప్పా రంకెలు వేశారు. జంతు రక్తంతో కటౌట్ కు అభిషేకాలు చేశారు. 10. కారు కింద వారి పార్టీ కార్యకర్త సింగయ్యను తొక్కించారు… కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారు. 11.కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు చేస్తూనే ఉన్నారు. ” అని సీఎం వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. ప్రజలందరిలోనూ భయాందోళనలు కల్పించారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే స్వేచ్ఛ కల్పించామని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళి ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ, చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *