-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3 సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా..
-డివిజన్ స్థాయి కమిటీ ప్రతి నెల చట్టం అమలు పై సమీక్షిస్తుంది..
-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో శ్రీనుకుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. వంశీ కృష్ణతో కలసి పీసీపీఎన్డీటి యాక్టు అమలుపై వైద్యులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ నిర్థారణ చట్టరీత్యా నేరమమన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో గల వైద్యులు గాని లేదా ల్యాబ్ నిర్వాహుకులు సాంకేతిక పరికరాలు ద్వారా లింగనిర్థారణ చేసినట్లు వెల్లడైతే పీసీ పీఎన్డీడీ చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. ఈ చట్టం అమలు పై జిల్లా స్థాయిలో కమిటీతో పాటు డివిజన్ పరిధిలో కూడా ఆర్డీవో, డిఎస్పీ,డిప్యూటీ డీఎంహెచ్ ఆద్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసారన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశం నిర్వహిస్తూ డివిజన్ పరిధిలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ను, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షిస్తూ ఈ చట్టం అమలు తీరు పరిశీలిస్తారన్నారు. ఈ చట్టాన్ని మొదటి సారి ఉల్లంఘించిన వైద్యులు గాని, నిపుణులు గాని లేదా ల్యాబ్ నిర్వాహుకులకు, ఇతరులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, తదుపరి కూడా ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైతే రూ.యాభై వేల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు గాని ల్యాబ్ నిర్వాహుకులు గాని లింగ నిర్ధారణ చేయు సామర్థ్యం గల ఏ యంత్రమైనా కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. వైద్యులు గాని సాంకేతిక ల్యాబ్ లు గాని సంబంధిత గర్భిణీకి గాని, ఆమె బంధువులకు గాని పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించడం నేరంగా పరిగణించ బడుతుందన్నారు. సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమతుల్యాన్ని పాటించాలని ఆర్డీవో శ్రీనుకుమార్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుడివాడ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ ఓ డా. వంశీకృష్ణ మాట్లాడుతూ గుడివాడ డివిజన్ లో గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షల చేయు డయాగ్నోస్టిక్ సెంటర్లు 8 ఉన్నాయన్నారు. ఎవరైనా గర్భస్తు లింగనిర్థారణ పరీక్షలకు చేసినట్లు వెల్లడైతే చట్టప్రకారం శిక్షార్హులన్నారు. దేశంలో ప్రతి వెయ్యింది బాలురకు 990 మంది బాలికలు మాత్రమే ఉన్నారన్నారు. డివిజన్ పరిదిలో ప్రతి నెల పీసీ పీఎన్డీటీ యాక్టు డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో డా. మాధురి, డా. విధ్యాధరి, అంకితా సోషల్ డవలప్మెంట ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు కె. లక్ష్మీసరోజ, కె. పార్వతి, బి. నాగమారుతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News