న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైన భారత్ టెక్స్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరస్మరణీయమైన కళా వారసత్వానికి ప్రతీక అయిన కలంకారీ శాలువాతో కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలోని హస్తకళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సాహం కల్పించే అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.
భారత్ టెక్స్–2026 వంటి ప్రతిష్ఠాత్మక వేదికలు దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలు, చేనేత, జౌళి రంగాలకు కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతీయ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే వేదికలుగా నిలుస్తాయని డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర హస్తకళల ప్రత్యేకత, కలంకారీ, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సంప్రదాయ కళలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కళాకారులకు అధిక ఉపాధి, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల విశిష్టతను జాతీయ స్థాయిలో ప్రదర్శించడం రాష్ట్రానికి గర్వకారణమని, హస్తకళా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News