Breaking News

డేటా డ్రివెన్ గవర్నెన్స్‌తో రియల్ టైమ్ రిజల్ట్స్

-నెలవారీ ఆర్ధిక నివేదికలతో ఆశించిన పురోగతి
-అర్జీల పరిష్కారం, క్షేత్ర స్థాయి పర్యటనలు తప్పనిసరి
-ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి
-మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ నెలా… నెలవారీ ఆర్ధిక నివేదికలను విడుదల చేస్తామని దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఎంఈఆర్‌పై నిర్వహించిన సమావేశంలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెలవారీ ఆర్ధిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”2019-2024 మధ్య అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం రెండేళ్లుగా సమిష్టిగా పనిచేసాం. ప్రభుత్వ ఆలోచనల్ని అధికార యంత్రాంగం సమర్ధంగా అమలు చేసింది. క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగాం. మరిన్ని రంగాల్లో మరింతగా మెరుగుపడాలి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పన చేశాం. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. సుపరిపాలన అందించేలా ప్రతీ సోమవారం ఆర్టీజీఎస్ నుంచి సమీక్షలతో పాటు 4 సార్లు మంత్రులు, కార్యదర్శుల సమావేశాలు, 7 సార్లు కలెక్టర్ల సదస్సులు నిర్వహించాం. 19 ఎస్ఐపీబీ సమావేశాలు, 52 కేబినెట్ సమావేశాల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది. మేం అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు తెచ్చాం. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించాం. ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. వనరుల్ని సమర్ధంగా వినియోగించుకోవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా అన్ని జిల్లాల్లో అపారమైన వనరులు, పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, గ్రానైట్ , బాక్సైట్ సహా విలువైన వనరులను వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన దగ్గర ఉన్నాయి. దానిని అందిపుచ్చుకునే నాయకత్వం మనకు కావాలి. పాలసీలు తీసుకురావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకం. ఇక నుంచి నెల వారీ ఆర్ధిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. ప్రతీ నెలా ఒకసారి కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశం ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకుందాం.” అని ముఖ్యమంత్రి అన్నారు.

అర్జీలు వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన

‘గత పాలనలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవటంతో ప్రజల నుంచి పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ద్వారా ఈ అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలి. గత పాలకుల వల్ల రెవెన్యూ శాఖలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. పీజీఆర్ఎస్‌లో జీరో పెండెన్సీ అనేది లక్ష్యం కావాలని అన్ని శాఖలకూ నిర్దేశిస్తున్నాను. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి లాంటి ప్రాంతాల్లో భూ సమస్యల్ని పరిష్కరించాం. రీసర్వే ప్రక్రియ ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రతీ నెలా 9 తేదీన పంపిణీ చేస్తున్నాం. ఇంకా 72 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ శాఖలు ఆర్జీల పరిష్కారం కోసం నిబంధనల్లో మార్పులు తీసుకురావడం, లేదంటే చట్టాలను సవరించే అంశంపై విశ్లేషణ చేయాలి. మెరుగ్గా పనిచేస్తే 15 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. పాలన సులభతరం చేసేందుకు, రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ కూడా రూపొందించాం. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో 24 శాతం మేర రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. జీఎస్డీపీ వృద్ధిరేటు 2017తో పోలిస్తే గత ఏడాదిలో 20 శాతం మేర పెరిగింది. కీలకస్థానాల్లో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అభివృద్ధి నిరోధకులుగా పనిచేయటం సరికాదని హెచ్చరిస్తున్నానను.’ అని ముఖ్యమంత్రి అన్నారు.

నాలుగు గోడలు దాటి వెళ్లాలి

ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలి. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి. మూడో ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. తొలిసారి ట్రూ డౌన్‌ను కూడా అమలు చేస్తున్నాం. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నాం. రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఎల్‌నినో కారణంగా తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఒక మంచి అధికారి సమస్యలను పరిష్కారిస్తే…అద్భుతంగా పనిచేసే అధికారి అసలు సమస్యలనేవే తలెత్తకుండా చూస్తారనే కోణంలో అందరూ పనిచేయాలి. ముందుచూపుతో అంతా పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలం. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆగస్టు 14 తేదీన అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తాం. సెప్టెంబరు 1వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను కూడా జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. ప్రతీ నెలా జరిగే మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు వెళ్దాం. రాష్ట్రాభివృద్ధిలో సహకరిస్తున్న అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెలవారీ ఆర్థిక నివేదికతో దేశంలోనే సరికొత్త పరిపాలనా విధానానికి శ్రీకారం

-డేటా ఆధారిత సుపరిపాలన, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయం -రాష్ట్ర సమాచార, పౌర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *