-డేటా ఆధారిత సుపరిపాలన, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయం
-రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని సరికొత్త పరిపాలనా విధానానికి నాంది పలికిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు వార్షిక ప్రాతిపదికన మాత్రమే రూపొందించే ఆనవాయితీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెలా “నెలవారీ ఆర్థిక నివేదిక (Monthly Economic Report)” రూపొందించే వినూత్న విధానాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నెలవారీ ఆర్థిక నివేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని శాఖల పనితీరు, ఆదాయ-వ్యయాలు, అభివృద్ధి సూచికలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, లక్ష్యాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించే అవకాశం లభిస్తుందని వివరించారు. ఇది కేవలం ఒక నివేదిక మాత్రమే కాకుండా, ప్రభుత్వ పరిపాలనకు దిశానిర్దేశం చేసే ప్రామాణిక పత్రంగా నిలుస్తుందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపారమైన పరిపాలనా అనుభవాన్ని, ఆర్థిక అవగాహనను, భవిష్యత్ దృష్టిని సమన్వయం చేసి ఈ విధానానికి రూపకల్పన చేశారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దేందుకు ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత చురుకుగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) వద్ద అందుబాటులో ఉన్న ప్రత్యక్ష సమాచారాన్ని, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి డేటా ఆధారిత పరిపాలన (Data Driven Governance) అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రజల సమస్యలను రియల్ టైమ్‌లో గుర్తించి, వెంటనే పరిష్కరించే విధంగా ప్రతి శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుంచి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిపాలనా దక్షత, ఆర్థిక క్రమశిక్షణ, దూరదృష్టికే చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రం ప్రతి సంవత్సరం కనీసం 15 శాతం ఆర్థిక వృద్ధి (Growth Rate) నమోదు చేయడంతో పాటు, 20 నుంచి 25 శాతం వరకు ఆదాయ వృద్ధి (Revenue Growth) సాధించేలా అన్ని శాఖలు లక్ష్య బద్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక ఆధారంగా శాఖల పురోగతిని సమీక్షించి, తదుపరి నెల లక్ష్యాలను నిర్ణయిస్తూ పరిపాలనను ఫలితాల దిశగా నడిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు చెప్పారు.
ఈ విధానాల ద్వారా నిరుద్యోగ సమస్యను గణనీయంగా తగ్గించడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల ఆదాయాలను పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
ప్రత్యేకంగా PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)లో “జీరో పెండెన్సీ” ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారని మంత్రి వెల్లడించారు. ప్రజావేదికలు, ప్రజాదర్బార్లు, జిల్లా పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి అందుతున్న ప్రతి వినతిని మానవీయ దృక్పథంతో పరిశీలించి, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో పరిపాలనా నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరి, ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల కారణంగా వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను కేవలం కార్యాలయ విధులుగా కాకుండా, బాధిత కుటుంబాల జీవన పరిస్థితులను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే పాత చట్టాలు, కాలానుగుణంగా అనవసరంగా మారిన నిబంధనలను సమీక్షించి, అవసరమైతే వాటిలో సవరణలు చేయడానికైనా, కొత్త చట్టాలను తీసుకురావడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజా ప్రయోజనమే ప్రభుత్వ నిర్ణయాలకు కేంద్రబిందువుగా ఉండాలని పేర్కొన్నారని వివరించారు.
పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులు, జిల్లా అధికారులు, మంత్రులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. కార్యాలయాల్లో మాత్రమే పరిమితమయ్యే పరిపాలనకు బదులుగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా సమస్యలను తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని, భవిష్యత్ విధాన నిర్ణయాలకు అది బలమైన ఆధారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు మంత్రి వివరించారు.
అధికారులు నిర్వహించే క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీలు, పరిశీలనల వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, అవసరమైతే AI ఆధారిత వ్యవస్థల ద్వారా RTGSలో నమోదు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు.
సుపరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన నిర్వహణ ఫలితంగానే గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఒక్క రూపాయి అదనపు విద్యుత్ భారం కూడా మోపకుండా విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిర్వహించగలిగిందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలపై అనవసర భారాలు పడకుండా ఆర్థిక నియంత్రణతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
అదేవిధంగా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు కేంద్ర ప్రభుత్వం నమోదుచేసిన వృద్ధిరేటు కంటే తక్కువగా ఉండేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ సగటును మించి నమోదవుతున్న విషయం సమావేశంలో ప్రత్యేకంగా చర్చించబడిందని మంత్రి వెల్లడించారు.
ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం తదితర రంగాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. ప్రకృతి పరిస్థితులను కారణంగా చూపకుండా, ప్రతి సవాల్‌ను శాస్త్రీయ విధానాలతో, సమన్వయంతో అధిగమించేందుకు అధికారులు వినూత్న ఆలోచనలు చేయాలని, ప్రభుత్వానికి కార్యాచరణ సూచనలు సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు.
రానున్న మూడేళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్ధేశించే అత్యంత కీలక కాలమని పేర్కొంటూ, ప్రతి మంత్రి, ప్రతి అధికారి ఫలితాల ఆధారంగా పనిచేసి స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.
ప్రజాకేంద్రిత పరిపాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, పారదర్శక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ వంటి సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ పరిపాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News