-క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఫిర్యాదుల సమాచారం
-ఫైళ్ల క్లియరెన్స్ పేరిట అభివృద్ధి ఆలస్యం కాకూడదు
-అవకాశాలు అందిపుచ్చుకునేలా నిబంధనల్లో వెసులుబాటు
-2017తో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20 శాతం వృద్ధి నమోదు
-ఆర్టీజీఎస్ సమీక్షలో దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దేవాదాయ, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా,అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న సంతృప్త స్థాయిపై సీఎం సూచనలు జారీ చేశారు. ప్రోయాక్టివ్ గవర్నెన్సు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే చిట్టచివరి వ్యక్తి వరకూ పాలనా ఫలితాలు అందుతాయని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మెరుగైన ఫలితాలు అందేలా నిర్ణయాలు ఉండాలని సీఎం సూచించారు. దేవాదాయశాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల్లో విస్తృతమైన పొటెన్షియల్ ఉందని .. సరైన ప్రణాళిక ద్వారా వీటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సూచనలు ఇచ్చారు. ఈ దేవాలయాలను ఆనుకుని ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతంగా పెరగాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ అర్జీదారుకూ తగిన సమాధానం కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. అగ్నిమాపక శాఖలో సేవల ప్రమాణాల్ని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై రైతు సంఘాలు, ఆర్ఎస్కేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని… యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మానవీయ కోణంలో అర్జీల పరిష్కారం
క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. బస్సులు ఖచ్చితమైన సమయానికి వచ్చే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. గత పాలనలో రాజకీయ కక్షతో కొందరి భూముల్ని 22ఏ కింద పెట్టి వివాదంలోకి నెట్టారన్నారు. ఇప్పటికి 27 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, ఇంకా 72 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందన్నారు. శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించటం ద్వారా రైతుల సమస్యలు తీరటంతో పాటు 900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ఇలాంటి అవకాశాలనే అన్ లాక్ చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్తో పాటు వివిధ రకాలుగా వచ్చే ప్రతీ అర్జీ, ఫిర్యాదునూ మానవతా కోణంతో పరిష్కరించాలని సీఎం సూచించారు. ఆర్ధిక, ఆర్దికేతర అంశాలతో పాటు వ్యక్తిగత, సామాజిక అంశాల్లో వచ్చే ఫిర్యాదులపై తగిన నిర్ణయాలు వేగంగా తీసుకోవాలన్నారు. రొటీన్‌గా ఉండే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అప్పుడే ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుందని అన్నారు. గ్రీవెన్స్‌ల పరిష్కారం ఆధారంగా ఫిర్యాదులు తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయో విశ్లేషించాలన్నారు. సమస్యలు పరిష్కారం అయితే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఆర్టీజీఎస్ రూపొందించిన గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ మాసపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షకు మంత్రి పార్థసారధి వర్చువల్‌గా, ఆర్టీజీఎస్ నుంచి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News