జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త:
జగ్గయ్యపేట నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్ నెట్టెం రఘురాం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. వివిధ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ పరిస్థితులను సమీక్షించారు.
వత్సవాయి మండలంలోని వత్సవాయి, లింగాల, గౌరవరం గ్రామాలతో పాటు పెనుగంచిప్రోలు మండలంలోని కొనకంచి, ముళ్లపాడు, పెనుగంచిప్రోలు, బండిపాలెం, చిల్లకల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. స్థానిక నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
వత్సవాయి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు, జడ్పీటీసీ కూటమి అభ్యర్థి వడ్లమూడి రాంబాబుతో కలిసి పోలింగ్ పరిస్థితులను సమీక్షించారు. లింగాల గ్రామంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టీడీ జనార్ధన్, సొసైటీ అధ్యక్షుడు తొండేపు జగన్మోహన్ రావుతో కలిసి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. గౌరవరం గ్రామంలో నియోజకవర్గ పరిశీలకురాలు ఉండవల్లి శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు తదితర నాయకులతో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి పారదర్శకత పాటించాలని, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు ఫోన్ ద్వారా ఆయా గ్రామాల నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సరళిని పర్యవేక్షించినట్లు తెలిపారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు, ఎన్నికల నిర్వహణలో సహకరించిన నాయకులు, కార్యకర్తలకు, విధులు నిర్వర్తించిన ఎన్నికల అధికారులు, సిబ్బందికి నెట్టెం రఘురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.
