-పేదలందరూ ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ను సద్వినియోగపరచుకునేలా జీవో నెం. 225 లో మార్పులు తీసుకురావాలని సూచన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగపరచుకునేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు రెగ్యులరైజేషన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలంటే.. జీవో నెం. 225 లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 75 గజాల కన్నా తక్కువ స్థలం ఉన్నవారికి ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుందని.. అదే విధంగా 75 గజాలు పైబడిన వారికి కూడా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా క్రమబద్ధీకరించే విధంగా జీవోలో మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడుతూ.. ఆ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కనుక బసవ తారక నగర్ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. సమావేశంలో నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, సెంట్రల్ ఎమ్మార్వో శ్రీను వెన్నెల, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.