-యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం
-తలసరి ఆదాయంలో 13వ స్థానం… అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం
-ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు అందించడంలో ఏపీ ప్రత్యేకం
-సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ (CNES) నివేదికపై సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో విశిష్ట స్థానాన్ని సాధించింది. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ AEI–2026లో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ (CNES) రూపొందించి విడుదల చేసిన ఈ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్ల కాలంలో చేపడుతున్న పరిపాలనకు అద్దం పట్టేలా ఈ నివేదిక ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సూచీ రాష్ట్రాల ఆర్థిక సంపదతో పాటు ప్రజలకు దక్కుతున్న సమాన అవకాశాలు, పౌరులకు అవసరమైన సేవలు అందించేందుకు ఆ సంపదను ప్రభుత్వాలు ఎంత సమర్థంగా వినియోగిస్తున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రూపోందించిందని చెప్పారు. గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సిక్కిం 0.63, కేరళ 0.60, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు 0.57 స్కోరుతో ఏపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీ ఆధారంగా సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్‌ను ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా గుర్తించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అత్యధిక ర్యాంకు సాధించడం విశేషం. ఐదు ప్రధాన అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. ప్రాథమిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు వంటి అంశాలను ఇందులో పరిశీలించారు. మొత్తం 23 విభాగాల్లోని 60 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి అంశానికి సమాన ప్రాధాన్యమిచ్చారు. ఈ ఐదు అంశాల్లో సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విభాగంలో ఏపీ 0.69 స్కోరు సాధించగా, రెండో స్థానంలో ఉన్న గోవా 0.50 స్కోరుకే పరిమితమైంది. మిగిలిన నాలుగు విభాగాల్లోనూ దేశంలో అగ్రరాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది.
సంపద కంటే అవకాశాల కల్పనే కీలకం
తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం రెండో స్థానంలో నిలవటం ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశంగా స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థాయిని బట్టి అంచనా వేసిన యాక్సెస్ స్కోరు 0.51 కాగా, వాస్తవంగా సాధించిన స్కోరు 0.66 గా నమోదైంది. అంటే రాష్ట్ర ఆదాయ స్థాయితో పోలిస్తే అంచనాలకు మించి 0.15 పాయింట్లు అధిక స్కోరు ఏపీ సాధించింది. ఆదాయానికి, అవకాశాల కల్పనకు మధ్య ఉన్న ఈ సానుకూల వ్యత్యాసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా నమోదైంది. కేరళలో+0.07, హిమాచల్ ప్రదేశ్ +0.06 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక రాష్ట్రం ఎంత సంపద సృష్టిస్తుందన్నది ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదని, ఆ సంపదను ప్రజలకు అవసరమైన అవకాశాలుగా మలచటమే ముఖ్యమని ఈ నివేదిక తేల్చి చెప్పింది. తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, స్వచ్ఛమైన ఇంధనం, వైద్య సదుపాయాలు, విద్య, ఉపాధి, బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, న్యాయ సేవలు ఎంతమేర ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్న అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది.
సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనలే కూటమికి అండ
సంపద సృష్టి కోసం పెట్టుబడులు తీసుకురావటంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించటం అవకాశాలను అన్ లాక్ చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటం వల్లే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026లో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలవటం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. జీవన ప్రమాణాలు సహా వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని చేసిన ఈ ఇండెక్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచేలా పనిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. సోషియో ఎకనామిక్ సెక్యూరిటీ, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం సహా వనరులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కుటుంబం నుంచి కమ్యూనిటీ ఆస్తుల వరకూ పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలుగా మన ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రతీ ప్రాంతానికీ, వర్గానికీ చేరువగా పాలన, అభివృద్ది అందుతుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచారని సీఎం వ్యాఖ్యానించారు.
