-అర్హులందరూ లబ్ధి పొందేలా మార్చి 11 వరకు గడువు పెంపు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేతివృత్తిదారుల అభివృద్ధే లక్ష్యంగా జగనన్న చేదోడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ నగదు విడుదల చేసిన నేపథ్యంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బీఆర్టీఎస్ బస్టాప్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా అణగదొక్కిందని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వెనుకబడిన అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా సముచిత స్థానం కల్పించిందన్నారు. కేబినెట్ కూర్పు నుంచి స్థానిక సంస్థల వరకు బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగిందన్నారు. నలుగురు సభ్యులను రాజ్యసభకు పంపిస్తే అందులో రెండు స్థానాలు బీసీలకే కేటాయించడం జరిగిందన్నారు.
దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి స్థాయిలో లబ్ధిపొందేలా సంక్షేమ పథకాలకు ఊపిరి పోసిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీలతో ప్రజలను నిలువునా దోచుకుంటే.. ఈ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శక పాలనను అందిస్తోందన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను ప్రజల గుమ్మం వద్దకు చేరుస్తున్నామన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో దాదాపు రూ. లక్షా 40 వేల కోట్ల సంక్షేమాన్ని డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) ద్వారా నేరుగా ప్రజల ఖాతాలలో నిధులను జమచేయడం జరిగిందన్నారు.
జగనన్న చేదోడు పథకం రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆత్మవిశ్వాసం మరింత పెంచిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్థిక సాయం అందించి వారి జీవితాల్లో జగనన్న ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి విడతలో 2,021 మందికి రూ. 2.02 కోట్లు., రెండో విడతలో 1,008 మందికి రూ. 1 కోటి 80 వేల రూపాయలు మొత్తం లబ్ధిదారులకు రూ. 3 కోట్లు వారి ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. పథకానికి అర్హులై ఉండి లబ్ధి పొందలేనివారు మరలా దరఖాస్తు చేసుకోవచ్చని మల్లాది విష్ణు తెలిపారు. మార్చి 11 వరకు గడువు ఉన్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి పథకం అందని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ ప్రజల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడా విస్మరించలేదని తెలిపారు. వృత్తిదారులను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగపరచుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, కొండాయిగుంట మల్లీశ్వరి, కొంగితల లక్ష్మీపతి, బాలిగోవింద్, శర్వాణీ మూర్తి, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, శనగశెట్టి హరిబాబు, నాగాంజనేయులు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఎం.కనకారావు, ఆర్.గణపతిరావు, ఎం.కిరణ్, డి.రాము, ఎం.నరసింహారావు, అప్పారావు, జి.రామ్మూర్తి, వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.