రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన మార్క్ ఫెడ్..


-మార్క్ అప్ పేరుతో నిత్యావసర వస్తువుల విక్రయాలు
-మార్క్ అప్ లోగో, ఉత్పత్తులను ప్రారంభించిన మంత్రి కురసాల కన్నబాబు, ఛైర్మన్ పి. నాగిరెడ్డి.
-సీఎం జగన్ రైతు పక్షపాతి… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.
-వ్యవసాయరంగంలో దేశంలో ఏపీ నెంబర్ వన్ : మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం తీసుకురావడం, అదే సమయంలో వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మార్క్ ఫెడ్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్) వినూత్న నిర్ణయం తీసుకుందని.. మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రభుత్వ విజయాలలో మరో విజయం నమోదయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్క్ అప్ ఉత్పత్తులను, లోగోను ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ పి.పి. నాగిరెడ్డితో కలిసి మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మంత్రితో కలిసి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, తదితరులు మార్క్ అప్ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు.
అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రైతుకు అదనపు ఆదాయం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ రైతుల పక్షపాతి అని.. ఈ ప్రభుత్వంలో 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు బత్తాయి, అరటి వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతు ఆదాయం తగ్గకుండా.. వినియోగదారుడికి సరసమైన ధరలకు ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలనే మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఇప్పటికే ఆయిల్ ఫెడ్ లో ‘విజయా బ్రాండ్’ చాలా ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. నాణ్యతే ప్రామాణికంగా.. రాష్ట్రంలోని ఉన్న 110 రైతు బజార్లు, కొత్తగా నిర్మాణం జరిగిన మరో 50 రైతు బజార్లలో అన్ని చోట్ల మార్క్ అప్ ఉత్పత్తులు లభ్యమయ్యేలా, గ్రామస్థాయి వరకూ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విత్తనం ఇచ్చే దగ్గర నుంచి విక్రయించే వరకు ప్రతి అడుగులోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతు పండించే ప్రతి ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత వైఎస్ జగన్ దే అని.. తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకులలో వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. కార్పోరేట్ సంస్థలు లాభాపేక్షతో వ్యాపారంలో ముందుకెళతాయని.. మార్క్ ఫెడ్ నాణ్యతతో ముందుకెళ్తుందన్నారు. కార్పోరేట్ సంస్థలను ఢీకొట్టేలా ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయం తీసుకోవడం అబినందనీయమని మంత్రి కన్నబాబు అన్నారు.
ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ పి.పి. నాగిరెడ్డి మాట్లాడుతూ… మార్క్ ఫెడ్ ను స్థాపించిన 65 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిందన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన అన్ని ఉత్పత్తులను ప్రొసెసింగ్ చేసి వినియోగదారుడికి అందుబాటులో ఉండేవిధంగా మార్క్ అప్ ఉత్పత్తులు ఉండాలన్నారు. ఎంత పోటీ ఉన్నా నాణ్యతలో రాజీ వద్దన్నారు.
అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల కొనుగోలు చేయడానికి అలాగే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఇబ్బందులు పడటం చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. సీఎం జగన్ ఆలోచనల మేరకు ఈ కార్యక్రమానికి రెండు సంవత్సరాల క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పంటలను.. కొంతకాలం తర్వాత అమ్మితే కనీస మద్దతు ధర కంటే తక్కువగా వస్తుందని.. అలా వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం పూడుస్తుందని తెలిపారు. అలాంటి నష్టాలను సరిదిద్దేందుకు ప్రొసెస్ చేసిన ఉత్పత్తులు అమ్మితే ప్రయోజన చేకూరుతుందన్నారు. ఇప్పటికే 50 యేళ్ల క్రితమే కేరళలో మావెల్లి స్టోర్స్ పేరుతో రిటైల్ మార్కెట్ లోకి ప్రభుత్వ రంగ సంస్థలు అడుగుపెట్టాయన్నారు. రైతులకు కనీస మద్దతు రావాలి లేదా అంతకంటే ఎక్కువ రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఏపీ మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. మార్క్ అప్ ద్వారా కంది పప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, చింతపండు, మిర్చి, పసుపు, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిర్చిపౌడర్, ధనియాల పొడి, రెండు రకాల బియ్యం (రా రైస్, స్టీమ్ రైస్) మొత్తం 12 రకాల ఉత్పత్తులను విడుదల చేస్తున్నామన్నారు. పంజాబ్, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్నారని.. రాష్ట్ర బృందం కేరళ వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలన చేసి వచ్చామని తెలిపారు. ఐటీసీ వంటి అంతర్జాతీయంగా పెరొందిన బ్రాండ్స్, లలిత, డబుల్ హర్స్ వంటి స్థానికంగా పెరొందిన బ్రాండ్స్ మధ్యలో మార్క్ ఫెడ్ విడుదల చేసే ఉత్పత్తులు నాణ్యతతో ముందుకెళ్తుందని తెలిపారు. 5లక్షల 36వేల ఫ్యాకెట్ల ఉత్పత్తులను 34 వేల కిరణా షాపులకు ఈ రోజు విడుదల చేస్తున్నామన్నారు. మార్చి మొదటి వారం నుంచి ఉత్పత్తులు అన్ని షాపుల్లో ప్రిమియం, పాపులర్, ఎకానమీ 3 కేటగిరీల్లో అందరికీ అందుబాటులోకి ఉండేలా వస్తాయన్నారు. రైతులు, వినియోగదారులు దృష్టిలో పెట్టుకుని ధరలు తక్కువ, ఎక్కువ కాకుండా న్యాయమైన ధరకే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హార్టీకల్చర్ కమిషనర్ డా. ఎస్.ఎస్. శ్రీధర్, కోఆరేషన్ అండ్ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీసీ కమిషనర్ బాబు ఎ., అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, సెర్ప్ సీఈవో ఎ. ఎండీ. ఇంతియాజ్, స్థానిక వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *