నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు డివిజన్లోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో భూముల మార్కెట్ విలువల సవరణ చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం భూముల మార్కెట్ విలువల సవరణ కమిటీ సమావేశం ఆర్టీవో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మైలవరం, నూజివీడు, విసన్నపేట, తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలలలో భూముల మార్కెట్ విలువల సవరణలను ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చేపట్టాలన్నారు. మండల కమిటీలో సంబంధిత సబ్ రిజిస్టార్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని, కమిటీలో ఎంపీడీవో , తహసిల్దార్, సంబంధిత గ్రామాల విఆర్వోలు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ ఆయా ప్రాంతాలను సందర్శించి, ఆయా ప్రాంతాలలో భూముల డిమాండ్, అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాంతాలు, జాతీయ రహదారులు వంటి అంశాలను పరిశీలించి భూముల విలువలను సవరణ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం భూముల విలువల సవరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని ఆర్డిఓ రాజ్యలక్ష్మి తెలియజేశారు. సమావేశంలో మైలవరం, నూజివీడు, విసన్నపేట, తిరువూరు సబ్ రిజిస్టార్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News