-జిల్లాలో 2020-21, 2021-22 సంవత్సరాలలో 178 రహదారి పనులకు రూ.1083 కోట్ల 25 లక్షలు మంజూరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయాణీకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్న రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా జరిగేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించి టెండర్లు పిలిచే పనులు కూడా చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వైపు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తూనే… అవసరమైన రహదారుల విస్తరణకు నిధులు కేటాయించింది. ఇక జిల్లా రహదారులపై ప్రయాణమంటే హాయి అన్నట్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
కృష్ణా జిల్లాలో అన్ని రహదారులు కలిపి 3554 కిలో మీటర్ల పైగా ఆర్ఎండ్ బి పరిధిలో రహదారులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో ప్రధాన రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. వీటి మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ. 1083 కోట్ల 25 లక్షలు మేర నిధులు విడుదల చేసింది. వీటిలో అత్యవసరంగా 7 ప్రధాన రహదారుల మరమ్మతుల నిమిత్తం 8 కోట్ల 37 లక్షలతో పనులు చేపట్టగా ఇప్పటికే 6 లక్షల 17 వేల రూపాయలు విలువైన 5 రహదారి పనులను పూర్తి చేయడం జరిగింది. వీటిలో మైలవరం డివిజన్లో కోటి 75 లక్షల నిధులతో వీరవల్లి నుండి వట్టిగుడిపాడు రహదారిలో ఆరు కిలో మీటర్లు, 50 లక్షల నిధులతో కోడూరు నుండి చౌటపల్లి రహదారిలో 3 కిలో మీటర్లు, 42 లక్షల నిధులతో నందిగామ నుండి పుట్రేల రహదారిలో 5 కి లో మీటర్లు, 2 కోట్ల నిధులతో ఎన్ హెచ్-5 వేలేరు నుండి బొమ్ములూరు రహదారి 12 కిలో మీటర్లు, మచిలీపట్నం డివిజన్లో కోటీ 50 లక్షల నిధులతో నోబుల్ రహదారి 2కీలో మీటర్లు పనులు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో జిల్లాలో రోడ్లన్నీ కొత్త రూపుతో కళకళ లాడనున్నాయి. ఆయా రహదారులపై హాయిగా ప్రయాణం సాగనుంది.
జిల్లా, రోడ్లకు పెద్దపీట
రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం సుమారు రూ.2,200 కోట్లను ఇటీవల కేటాయించిన సంగతి తెలిసిందే. వాటిలో రూ.136.49 కోట్లను ప్రత్యేక మరమ్మతులు, రోడ్ల పునర్నిర్మాణ పనులకు మన జిల్లాకు దక్కాయి. ఈ నిధులతో సుమారు 70 రహదారి పనులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి జిల్లాలో మొత్తం 3554 కిలో మీటర్ల పొడవున ఆర్ఎండ్ బి శాఖ పరిధిలో రహదారులు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో వీటి నిర్వహణ సరిగా లేకపోవడం, వీటితోపాటు వరుసగా తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా వీటిని అత్యవసర మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం రూ.8.37 కోట్లు ముంజూరు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించింది. ఇంకా చాలా చోట్ల రహదారులు బాగా లేకపోవడంతో ప్రభుత్వం వాటి మరమ్మతులు పునర్నిర్మాణపనులకు నడుంబిగించింది. జిల్లాలో అత్యవసరంగా రోడ్లను మరమ్మతు చేయాలని కొన్ని చోట్ల పూర్తిగా కొత్త లేయర్లు చేయాలని ఆర్ఎండ్ బి అధికారులు ప్రతిపాదనలు పంపగా ఆమేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
పనులపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో రహదారుల మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. మచిలీపట్నం, విజయవాడ, మైలవరం డివిజన్లలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రస్తుతం రోడ్ల మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. రానున్న జూలై నెలకల్లా అన్నీ పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికీ పలు రహదారుల మరమ్మతులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. మిగిలిన వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆర్ఎండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్ శ్రీనివాసమూర్తి అన్నారు.