-దరఖాస్తుల పరిష్కారంలో నాణ్యత ముఖ్యమైనది : సక్రమంగా పరిష్కరించని అధికారులపై చర్యలు
-పని అడిగిన ప్రతీ కూలీకి 100 రోజుల పాటు పని కల్పించాలి
-అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాదించాల్సిందే : డివిజన్ సమీక్షలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడంతోపాటు, నాణ్యమైన రీతిలో పరిష్కారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె కన్వెన్షన్ హాలులో బుధవారం రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై గుడివాడ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కార విధానంలో రెవిన్యూ, మరియు వివిధ శాఖలకు సంబందించిన దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, గ్రామ/వార్డ్ గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలో ప్రజలు పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, వంటి చిన్న చిన్న సమస్యలపై అందించిన ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 24 గంటలు లేదా 48 గంటలుగా నిర్దేశించడం జరిగిందన్నారు. వాటిని నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించి, పరిష్కార విధానాన్ని ఫిర్యాదుదారుడికి తెలియజేయడంతోపాటు, ఫోటోలను ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. సక్రమంగా పరిష్కరించని దరఖాస్తులను మరల రీఓపెన్ చేయబడతాయన్నారు. స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలో పరిష్కరించడంతోపాటు, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కార విధానాన్ని రాష్ట్రస్థాయిలో సంబంధిత దరఖాస్తుదారునికి ఫోన్ చేసి పరిష్కార విధానంపై సంతృప్తి చెందినది, లేనిదీ తెలుసుకుని సమీక్షించడం జరుగుతుందని, దరఖాస్తుదారు సంతృప్తి చెందని పక్షంలో మరల దరఖాస్తును రీఓపెన్ చేస్తారన్నారు. తూ తూ మంత్రంగా పరిష్కరించినట్లు ఆన్లైన్ లో నమోదు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలపై కలెక్టర్ సమీక్షిస్తూ నవరత్నాలు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాటిని అర్హులైన పేదలందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయవలసి బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసేందుకు ప్రతీ నెలా డివిజన్ స్థాయిలో మండల స్థాయి అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించాల్సిందేనని, లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. సమీక్షలో పధకాల అమలులో ప్రగతి సాధించే అధికారులను అభినందిచడంతోపాటు, వెనుకబడి ఉన్నఅధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా రెవిన్యూ కార్యక్రమాలపై సమీక్షిస్తూ జగనన్న భూరక్ష, భూ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో పారదర్శకతతో పనిచేయాలన్నారు. నిర్ణీత సమయంలోనే పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్దిదారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి పధకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. . జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో పని అడిగిన కూలీలకు తప్పనిసరిగా 100 రోజులు కల్పించాల్సిందేనన్నారు. అందుకు అవసరమైన పనులను మండలంలో గుర్తించాలన్నారు. కూలీలకు వేతనాలను నిర్దేశించిన సమయానికే వారి ఖాతాలలో జమ అయ్యేలా చూడాలన్నారు. పని కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికి పని కల్పించాల్సిందేనన్నారు. గుడివాడ మండలంలో జాతీయ ఉపాధిహామీ పధకం అమలు వెనుకబడి ఉందని, ఎంపిడిఓ, ఉపాధి హామీ పధకం సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతీ మండలంలోనూ సగటున 2 వేల మందితో పనులు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పధకం కింద జిల్లాలో పెద్దఎత్తున ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం జరిగిందని, వాటిల్లో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఉచితం ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి సంక్షేమ పధకాల అమలును మండల స్థాయి అధికారులు విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీలు చేయాలనీ, గ్రామ/వార్డ్ సచివాలయాలలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ నివాస్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, శ్రీవాసు అజయ్ కుమార్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ సూర్య ప్రకాష్, ఆర్డీఓ జి. శ్రీనుకుమార్, ఉపాధిహామీ పధకం ప్రాజెక్ట్ అధికారి సూర్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి రామచంద్రన్, , డివిజన్లలోని తహసీల్దార్లు, ఎంపిడిఓలు, రెవిన్యూ, గృహ నిర్మాణం, ఎం ఆర్ ఈ జి ఎస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News