-అంకెల గారడీ బడ్జెట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అప్పులు తెచ్చి అంకెల గారడీ బడ్జెట్ ను శాసనసభ లో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందని శైలజనాద్ విమర్శించారు. గత బడ్జెట్ లో దోచిందెంత, దాచింది ఎంతో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి సంక్షేమాన్ని విస్మరిస్తూ తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని ఆరోపించారు. ఇదో మాయల మరాఠీ బడ్జెట్ అని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని మండిపడ్డారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కారణకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో అమరావతి పేరు ప్రస్తావన కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలెవరికీ రుణాలివ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.