-మొక్కలను చివరి వరకు పరిరక్షించే వారికి ప్రోత్సాహకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ టీచర్స్ ఎంప్లాయిస్ కాలనీలో ఈషా అనే చిన్నారి జన్మదినాన్ని పురస్కరించుకొని S.N.G ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మల్లాది విష్ణు ప్రసంగిస్తూ.. జగనన్న పచ్చతోరణం కార్యక్రమ స్ఫూర్తితో లే అవుట్ నందు మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. ఇదే స్పూర్తితో ప్లాట్ కి ఒక మొక్క చొప్పున మొత్తం 711 మొక్కలను నాటాలని సూచించారు. 56 ఎకరాలలో విస్తరించిన లే అవుట్ లో విస్తృతంగా మొక్కలు నాటడమే కాకుండా చివరి వరకు పరిరక్షించే వారికి ప్రోత్సాహకాలు అందజేసేలా చూస్తామన్నారు. లే అవుట్ నందు ఇప్పటికే రహదారులను నిర్మించడం జరిగిందని.. ప్లాట్ యజమానులు ఇళ్ల నిర్మాణాలకి ముందుకు వస్తే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న పచ్చతోరణం పేరిట కొన్ని లక్షల మొక్కలు నాటడమే కాకుండా.. కొత్తగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలలో తప్పనిసరిగా మొక్కలు పెంచాలనే నిబంధన విధించడం జరిగిందని గుర్తు చేశారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయి పట్టణాలు, గ్రామాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్న తరుణంలో.. మన ఇంటి పరిసరాల్లో, చేరువలో పచ్చదనాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఉందన్నారు. నానాటికి పెరుగుతున్న కాలుష్య కోరల నుంచి నుంచి బయటపడాలంటే.. మొక్కలను పెంచడం ఒక్కటే మార్గమన్నారు. మొక్కలు నాటడం ద్వారా భారీ ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చని మల్లాది విష్ణు తెలిపారు. చెట్లే మానవ జాతికి గురువులని వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన గాలి, వాతావరణ పరిశుభ్రతకై ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్ధలు పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. తత్ఫలితంగా విజయవాడ నగరమంతా పచ్చదనం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ కార్పొరేటర్ ఉద్ధంటి సునీత, నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, S. N. G. ఫౌండేషన్ ఫౌండర్ శారదా వాణి, సభ్యులు ప్రసాద్, రామకృష్ణ, సాయి, వీఎంసి టీచర్స్ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.