-రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఆదాయం లేదు… రాబడి లేదు … ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ పై అధిక వ్యాట్, లిక్కర్ పై అయితే సరే సరే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది?
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు… ఇచ్చిన మాటను మరిచిపోయారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న మనం… ఇవాళ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నాం. గ్రామాల్లో 3 నుంచి 6 వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన మీరే… ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలి? బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో మీరే చెప్పండి.
ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు
తెల్లారిందంటే చాలు… జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుంది. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.