-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్-ఆన్ కార్యక్రమంలో గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ‘ఆరోగ్యశ్రీ’ ఆరోగ్య పథకం కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందించి వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటికే ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వినికిడిలోపం ఉన్న దివ్యాంగ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక వ్యాధులకు ఉచిత వైద్యం అందించటం మంచి నిర్ణయమని, సమాజంలోని ఆపదలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య పథకం కింద అందజేసే ప్రయోజనాలపై నిరుపేదలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఒక్కో కాక్లియర్ ఇంప్లాంట్‌కు దాదాపు రూ.8 లక్షలు ఖర్చవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ ఆరోగ్య పథకం కింద పిల్లలకు పూర్తి ఉచితంగా ఇంప్లాంట్ సర్జరీలు పూర్తి చేశామన్నారు. సుబ్బరాయుడు, వైద్యుల బృందం అందించిన సేవలను ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, సంయుక్త కార్యదర్శి ఎ. శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి డి. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.