విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి పి.విశ్వరూప్ తొలిసారిగా ఆర్టీసీ హౌస్ ని సందర్శించారు. సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. ఆయనకు పూల కుండి అందజేసి, సాదర ఆహ్వానం పలికారు. ఆర్టీసీ హౌస్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు జరిగిన 26 జిల్లాల ప్రజా రవాణా శాఖా అధికారుల తొలి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. తొలుత మంత్రి కి అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులను పరిచయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థలో 998 హైర్ బస్సులు తీసుకునేందుకు ఆయన తొలి సంతకం చేయడం సంతోషకరమన్నారు. డీజిల్ బల్క్ రేటు ఎక్కువగా ఉండడం వలన బయట బంకుల్లో రిటైల్ ధరలకు బస్సులకు డీజిల్ నింపుకోవడం జరుగుతుందని వివరించారు. బల్కు రేటు కన్నా రిటైల్ రేటు రూ. 5.86 తక్కువగా వుండటం వల్ల ఈ విధంగా చేస్తు, నష్టాలను కొంతమేర తగ్గిస్తూన్నామన్నారు. ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఆయిల్ నింపే కార్యాలోచన పరిశీలనలో ఉన్నదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించడం జరిగిందని తెలిపారు. కార్గో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు తెలిపారన్నారు. 1.1.2016 జనవరి నుండి 31 డిసెంబర్ 2019 మధ్య కాలంలో మరణించిన 896 మంది ఉద్యోగుల పిల్లల దరఖాస్తులు పెండింగ్లో వున్నాయని తెలిపారు. విలీనం తరువాత ఇప్పటివరకూ 956 అర్జీలు కూడా పరిసీలనలో వున్నయని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పి.ఆర్.సి. ఇంకా ఖరారు కాలేదని, కేడర్ ఈక్వలైజేషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. అలాగే ఉద్యోగులకు ఎస్.బి.ఐ. శాలరీ ప్యాకేజీ కింద సహజ మరణానికి కూడా రూ.5లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఎం.డి. తెలియజేశారు.
రవాణా మంత్రి విశ్వరూప్ అధికారులను ఉద్దేసిoచి మాట్లాడుతూ, తొలిసారిగా మీ అందరితో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని, దానికి తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని, వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోను మరియు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా APSRTC ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. దాని వల్ల 50,౦౦౦ మంది ఉద్యోగుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో వెలుగు నింపారన్నారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు. ఆ సమయంలో జగన్ గారు జీతాలు ఇచ్చి ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం సంస్థ ఓ.ఆర్. 73 % ఉందని,78% మేరకు పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ.పి.కే. పెంచుకోవడం వల్ల సంస్థ ఆర్ధికంగా పుంజుకుంటుందన్నారు. డీజిల్ రేటు బాగా పెరగడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ విధించవలసి రావాడం బాధాకరమన్నారు. తక్కువ భారం ప్రజలపై మోపడం జరిగిందని, దీన్ని ప్రతి పక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అర్ధం చేసుకుని అంగీకరించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా ఇక్కడ తక్కువ సెస్ విధించడం జరిగిందన్నారు. సంస్థలో డ్రైవర్లు డ్యూటి లు చేసేటప్పుడు అస్వస్థతకు గురి అవుతున్నారని, తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం వలనే ఇలా జరుగుతుందన్నారు. ఆరోగ్యం సహకరించక అలా ఇబ్బంది పడే ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ పట్ల సానుకూల దృక్పధంతో వున్నదన్నారు.
ఏటా రూ. 200 కోట్ల ను కొత్త బస్సుల కొనుగోలుకు కేటాయించాలని కోరగా, మంత్రి తక్షణమే స్పందిస్తూ, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో జోన్ల వారీగా, జిల్లాల వారీగా ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చిన అధికారులను అభినందించి, రవాణా శాఖా మంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు.
చివరగా, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.కోటేశ్వర రావు మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యులు ఉన్నప్పటికీ, రవాణా మంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేసి, అధికారులకు స్ఫూర్తి దాయకమైన విషయాలను, సూచనలు చేసిన మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటు 26 జిల్లాల నూతన ప్రజా రవాణా శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …