-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. పేద బ్రాహ్మణ, అర్చకులను ఆదుకోవడంలో క్రెడిట్ సొసైటీ పాత్ర మరువరానిదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సొసైటీ ద్వారా అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే బ్రాహ్మణ యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు.. ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నియోజకవర్గంలో 300 మంది బ్రాహ్మణ యువతకు రూ. 6 కోట్ల రుణాలు అందించేందుకు అప్లికేషన్స్ తీసుకోవవడం సంతోషకరమన్నారు. ఇప్పటివరకు బ్రాంచ్ ద్వారా రూ.15 కోట్లు రుణాలు పంపిణీ చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల రుణాలు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకున్నామని సొసైటీ అధికారులు తెలియజేశారు. ఈ రుణాలను బ్రాహ్మణ సామాజికవర్గం ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సుసర్ల శ్రీనివాసరావు, సొసైటీ సీఈవో నాగసాయి, బ్రాంచి మేనేజర్ శ్రీనివాస్, బిందు, ఎం.మహేష్ కుమార్, ఎన్.మురళీకృష్ణ, బి.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.