Breaking News

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రికి లేఖ రాశారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-టీడీపీ హయాంలో మహిళలపై జరిగినన్ని అకృత్యాలు దేశంలో ఎక్కడా జరగలేదు
-ఆడబిడ్డలపై పచ్చ గ్యాంగ్ జరిపిన అకృత్యాలకు, మహళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పై జరిగిన దాడికి క్షమాపణ కోరుతూ చంద్రబాబు బహిరంగ లేఖ రాయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో మహిళలకు ఏపాటి రక్షణ కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యపాన నిషేధం ఎత్తివేత, అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించడం, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు, విపరీతంగా బెల్టు షాపులు పెట్టించడం.. ఇవి అధికారంలో ఉండగా చంద్రబాబు సాధించిన ఘన విజయాలన్నారు. తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే తప్పు ఆమెదేనంటూ రౌడీని వెనకేసుకొచ్చారన్నారు. నాగార్జున యూనివర్శిటీలో బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసిన వారిని కాపాడింది మీరు కాదా..? అంటూ ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ కోడలు పద్మప్రియ అత్తింటి వేధింపుల గురించి బయటకొచ్చి చెబితే కనీసం ఆమెను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి వైశ్య మహిళకు ఇచ్చి.. వెంటనే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మహిళకు కేటాయించడంతో అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని గృహనిర్భంధం చేసి.. ఆయన భార్యను, కోడల్ని పోలీసులు అసభ్యంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరుమెదపలేదన్నారు. నగరి ఎమ్మెల్యే, సోదరి రోజాను ఎన్ని రకాలుగా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం హింసించింది ఎవరూ మర్చిపోలేదన్నారు. నీ తనయుడు నారా లోకేష్ టీంలో ఉన్న కొందరు మీ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను వేధిస్తే కనీసం పిలిపించి మందలించలేకపోయారన్నారు. విజయవాడ టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న 9వ తరగతి బాలిక దీక్షిత కుటుంబాన్ని నేటికీ పరామర్శించలేదన్నారు. ఇలా అనేక విషయాలను తన వెనుక పెట్టుకుని మరలా ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు లేఖ రాశారని మండిపడ్డారు.

2014 నుంచి 2018 వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ప్రతి ఏటా పెరుగుతూనే వచ్చాయని మల్లాది విష్ణు అన్నారు. మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, గృహహింస.. ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో మహిళలు పడిన వేదన వర్ణనాతీతమన్నారు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదైతే.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాలే 44,780 కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు పాలనలో ఆడబిడ్డలపై పెచ్చుమీరిన పచ్చ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయి సంస్థలు సైతం నిగ్గుతేల్చాయన్నారు. మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్‌ నుంచి జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడి దాకా సాగించిన దౌర్జన్యకాండ అంతాఇంతా కాదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెట్రేగిపోయిన ఘటనల్లో ప్రభుత్వ అధికారులు సైతం బాధితులుగానే మిగిలారన్నారు. ప్రొఫెసర్ల వేధింపులతో వైద్య విద్యార్థిని సంధ్యారాణి బలవన్మరణం., లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జూనియర్‌ డాక్టర్‌ శిల్ప., టీడీపీ నేతల దన్నుతో అమాయక మహిళలను వ్యభిచారంలోకి నెట్టిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌.. ఇలా చెప్పుకుంటూపోతే నారా వారి నరకాసుర పాలనలో ఎక్కడ చూసినా అబలలపై అకృత్యాలే దర్శనమిస్తాయన్నారు. చివరకు కరువు, అప్పుల బాధలు తాళలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే.. నష్టపరిహారం ఇస్తే ఆత్మహత్యలు పెరుగుతాయని పరిహారం కోరిన రైతుల భార్యలనుద్దేశించి వెక్కిరించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. అటువంటి చంద్రబాబు భయానక పాలనను మహిళలు ఎన్నటికీ మర్చిపోరని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడితే.. ప్రజల్లో విలువలు ఉండాలంటూ, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో పోలీస్ ను పెట్టలేమని ఆనాడు ముఖ్యమంత్రిగా నీవు మాట్లాడిన మాటలు అప్పుడే మరిచావా..? ఆడది కనపడితే ముద్దైన పెట్టాలి లేదా కడుపైనా చేయాలని మీ పార్టీ శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడితే.. ఎందుకు ప్రశ్నించలేకపోయారన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అంటూ స్వయంగా ఆడబిడ్డల పట్ల మీ సంకుచిత భావాన్ని వ్యక్తపరిచారని గుర్తుచేశారు. చివరకు మహిళలకు రక్షణ ఇచ్చే దిశ పత్రులను తగలెట్టే స్థాయికి మీ పార్టీ సభ్యులు దిగజారారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ముగిసే నాటికి 2018 జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 8వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరిగితే.. ఏపీలో మాత్రం ప్రతిలక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని ఆనాడు నీతి ఆయోగ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించారు. బీహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు అధికమనే చేదు నిజం ‘నీతి ఆయోగ్‌’నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైందన్నారు.

మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలలో అత్యధికం అక్కచెల్లెమ్మల పేరిట ప్రారంభించడం జరిగిందన్నారు. చంద్రబాబు అక్కచెల్లెమ్మలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్‌ అడుగడుగునా అండగా నిలిచారన్నారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ ను డమ్మీగా చేయగా.. జగనన్న ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా మార్చిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బాలిక, మహిళపై అత్యాచారాలు జరగకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన గూర్చి సమాచారం తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి, అన్ని శాఖలను ఆదేశించారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం వేగంగా జరిగిపోయాయని అన్నారు. అదే గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అకృత్యాలకు, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మపై జరిగిన దాడికి బేషరతుగా క్షమాపణ కోరుతూ, చంద్రబాబు ముందుగా బహిరంగ లేఖ రాయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *