Breaking News

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సీతారామపురంలోని శ్రీనివాసరావు వారి వీధి, పాపయ్య వారి వీధి, నేతాజీ వీధులలో ఆదివారం వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ శరవేగంతో జరుగుతోందని తెలిపారు. ఉదయం 7గంటల నుంచే అవ్వాతాతలు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్‌ డబ్బును అందజేస్తున్నారన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న, సుదూర ప్రాంతాలలోని లబ్ధిదారులకు కూడా పింఛన్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వర్తించేందుకు అర్హత ఉంటే చాలని.. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే గత చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్ల వ్యవస్థను అవినీతిమయం చేశారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీల పేరుతో లంచాల వ్యవస్థను తీసుకొచ్చి ఇష్టానుసారంగా దోచుకుతిన్నారని మండిపడ్డారు. పైగా 5 డివిజన్లకు కలిపి ఒకచోట ఎండలో కూర్చోబెట్టి పింఛన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని గుర్తుచేశారు. ఫలితంగా అవ్వాతాతలు పింఛన్ డబ్బులో సగం ఆటో ఖర్చులకే చెల్లించాల్సి వచ్చేదన్నారు. తెలుగుదేశం విధానాలు నచ్చకే ప్రజలందరూ సరైన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ప్రజల గుమ్మం వద్దకు చేరుస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 18 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25 వేలకు పెంచడం జరిగిందన్నారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే జూన్ మాసంలో నూతన పెన్షన్ లను మంజూరు చేయటం జరుగుతుందన్నారు. పేదలకు సంక్షేమం అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత ప్రభుత్వాలతో కానీ.. దేశంలోని మరే ఇతర ప్రభుత్వాలతో కానీ ఏమాత్రం పొంతన లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ కొమ్ము చంటి, నాయకులు బొంగరాల భాస్కర్, వెంకట్రామి రెడ్డి, క్రాంతి, సులోచన రావు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *