విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“కడుపులో మంట, గ్యాస్ సాధారణమే అయినా మంచి జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లతో జీర్ణకోశ సమస్యలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ప్రతి ఒక్కరూ వీటి గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం” అని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సి.హెచ్.వీర అభినవ్ గారు పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోం లో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన “కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం – తీసుకోవలసిన జాగ్రత్తలు” అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మన దేశంలో 17శాతం మంది ఎసిడిటీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సమయపాలన లేని భోజనం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల చాలామందిలో ఎసిడిటీ, గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు, అజీర్ణం వంటి సమస్యలు పెరిగాయన్నారు. మన కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సహజంగా ఉత్పత్తి అవుతుందని, ఆహారం జీర్ణం కావడానికి, కొన్ని హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. అయితే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు ఛాతీలో మంట, గొంతులో అసౌకర్యం, పుల్లటి రుచి వంటి లక్షణాలు కనిపిస్తాయని. దీనినే సాధారణంగా యాసిడ్ రిఫ్లక్స్ అంటారన్నారు. సాధారణంగా ఆహారం కడుపులోకి వెళ్లిన తరువాత తిరిగి పైకి రాకుండా లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ నిరోధిస్తుందన్నారు. ఈ కండరం సరిగా పనిచేయకపోవడం లేదా తరచుగా సడలిపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు, జీర్ణమైన ఆహారం తిరిగి అన్నవాహికలోకి చేరుతాయని, ఈ పరిస్థితి తరచుగా లేదా దీర్ఘకాలం కొనసాగి ఇబ్బందులు కలిగిస్తే దానిని GERD అంటారన్నారు. దీర్ఘకాలంగా ఆమ్లాల ప్రభావం వల్ల అన్నవాహిక లోపలి పొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. ఛాతీ మధ్య భాగంలో లేదా గుండె దగ్గర మంటగా అనిపించడం, నోటి వరకు పుల్లటి లేదా చేదు ద్రవం రావడం, తరచుగా త్రేన్పులు రావడం, భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు లేదా మంటగా అనిపించడం, తరచూ దగ్గు రావడం, ముఖ్యంగా రాత్రి సమయంలో, గొంతు బొంగురుపోవడం లేదా స్వరం మారడం, మింగేటప్పుడు అసౌకర్యం కలగడం, పడుకున్నప్పుడు లేదా ముందుకు వంగినప్పుడు ఛాతీలో మంట పెరగడం, కొందరిలో నిద్రకు అంతరాయం కలగడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి భోజనం చేయడం, ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా కొద్దికొద్దిగా తినడం, భోజనం చేసిన 2–3 గంటల తరువాతే నిద్రపోవడం, అధిక కొవ్వు పదార్థాలు, వేయించిన ఆహారాన్ని తగ్గించడం, తమకు ఏ ఆహారం తీసుకున్నప్పుడు మంట పెరుగుతుందో గుర్తించి దానిని తగ్గించడం, అధిక బరువు ఉన్నవారు క్రమంగా బరువు తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం చేస్తే ఈ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. రాత్రిపూట సమస్యలు ఎక్కువగా ఉండేవారు మంచం తలవైపు భాగాన్ని 6–8 అంగుళాలు ఎత్తుగా ఉంచుకోవడం మంచిదన్నారు. ప్రతిరోజూ నడక, శారీరక వ్యాయామం, మానసిక ఒత్తిడిని అధిగమించడం, తగినంత నిద్రపోవడం, తగిన మోతాదులో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పీచు పదార్థాలు ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. దీర్ఘకాలంగా GERD సమస్యను గుర్తించకుండా వదిలేస్తే అన్నవాహికలో వాపు, పుండ్లు, రక్తస్రావం, అన్నవాహిక కుంచించుకుపోవడం వంటి సమస్యలు రావచ్చు అన్నారు. కొంతమందికి భవిష్యత్తులో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. అయితే GERD ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని భావించకూడదన్నారు. ముఖ్యంగా ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, చేతికి లేదా దవడకు వ్యాపించే నొప్పి ఉంటే దానిని కేవలం గ్యాస్ లేదా అసిడిటీగా భావించకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలన్నారు. గుండెపోటు లక్షణాలు కూడా ఇలాగే ఉండవచ్చన్నారు. సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలన్నారు. శ్రీ డి.రవికుమార్ వందన సమర్పణ చేసారు. సదస్సులో పాల్గొన్న పలువురు అనేక ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు.
జీర్ణకోశ సమస్యలని నిర్లక్ష్యం చేయవద్దు
