గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలోని ప్రజలకు స్థానికంగా ఆహ్లాదం కల్గించే అంతర్గత పార్క్ ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. పార్క్స్ ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. బుధవారం కమిషనర్ బ్రాడిపేట, అరండల్ పేట, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్.టి.సి.కాలని, షాప్ ఎంప్లాయీస్ కాలని, పాత గుంటూరు, శ్రీనివాసరావు తోట, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఉన్న పార్క్ లను పరిశీలించి, ఆయా పార్క్ ల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై ఇంజినీరింగ్ అధికారులకు, పార్క్స్ ఏ.డి.హెచ్.కు తగు ఆదేశాలు జారీచేసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలనీల్లో ఉన్న పార్క్ ల విస్తీర్ణం, ప్రతి రోజు వాటిని వినియోగించుకుంటున్న స్థానిక ప్రజలను అనుసరించి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. పార్క్ ల్లో గ్రీనరి, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. పార్క్ స్థలాలు ఆక్రమణలో ఉంటె వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. పార్క్ ల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో స్థానిక వాకర్స్ అసోసియేషన్లను కూడా భాగస్వాములను చేయాలన్నారు. వాకర్స్ అసోసియేషన్ సహకారంతో పార్క్ ల్లో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రోడ్ల మధ్యలోని డివైడర్ల మీద ఉన్న గ్రీనరి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మొక్కల ట్రిమ్మింగ్, కలుపు తొలగింపు పై శ్రద్ధ చూపాలన్నారు. పార్క్ ల్లో విధులు నిర్వహించే కార్మికులు తప్పనిసరిగా సెలవు కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారి స్థానంలో బదిలీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు. పర్యటనలో ఏ.డి.హెచ్. రామారావు, హార్టికల్చరిస్ట్ చిన్నారావు, సూపర్వైజర్ అశోక్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News