గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం

-డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ మేయర్‌తో పాటు 76 మంది కార్పొరేటర్లతో పదవీ ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో 64వ వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం తన ప్రధాన ప్రాధాన్యత అని చెప్పారు. గుంటూరు నగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరపాలక సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.