-మూడు విభాగాల్లో రసవత్తరంగా జరిగిన పోటీలు
-పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న బీఎన్ఐ సభ్యులు, వారి కుటుంబసభ్యులు
-విజేతలకు బహుమతుల ప్రదానం
-బీఎన్ఐ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్-3కి విశేష స్పందన
-బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వ్యాపారస్తుల పరస్పర సహకార, అభివృద్ధి వేదిక బీఎన్ఐ బాడ్మింటన్ లీగ్ సందడిగా సాగింది. గురునానక్ కాలనీ సాయి సందీప్ బాడ్మింటన్ అకాడమీలో బుధవారం జరిగిన ఈ టోర్నీలో బీఎన్ఐ సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు మొత్తం మూడు విభాగాల్లో జరిగిన ఈ బీఎన్ఐ బాడ్మింటన్ లీగ్ సీజన్-3లో మొత్తం 140 మంది పాల్గొని టోర్నీని విజయవంతం చేశారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ నిర్వహణలో జరిగిన ఈ టోర్నీ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, బీఎన్ఐ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ, రోజంతా ఉల్లాసంగా గడిపారు. పోటీల్లో విజేతలు, రెండోస్థానంలో నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ టోర్నీ ఛైర్మన్ గా దేవకుమార్, టైటిల్ స్పాన్సర్ గా భ్రమర టౌన్ షిప్ అధినేత మారం చంద్రశేఖర్ వ్యవహరించగా, టోర్నీ నిర్వహణకు పలువురు సహాయ సహకారాలు అందించారని జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. వ్యాపారాభివృద్ధికి పరస్పర సహకారం అందించడమే కాకుండా, సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా బీఎన్ఐ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందని వారు చెప్పారు. సభ్యులందరూ కుటుంబసభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ బాడ్మింటన్ లీగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. బీఎన్ఐ బాడ్మింటన్ లీగ్ సీజన్-3కి విశేష స్పందన లభించడం పట్ల జై దేశాయ్, విశాల్ దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు.