-పూర్తి వేతనాల చెల్లింపునకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రోడ్డు ప్రమాదాల్లో పాల్గొన్నప్పటికీ శాఖాపరమైన విచారణలో తప్పు లేదని తేలిన డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఊరట కల్పించింది. డ్రైవింగ్ లైసెన్సులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ, అవి పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించి పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ నవంబర్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డిప్యూటీ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, డిపో మేనేజర్లు, ఇతర సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు పంపించారు.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల్లో పాల్గొన్న డ్రైవర్ల లైసెన్సులను సంబంధిత అధికారులు సస్పెండ్ చేస్తున్న నేపథ్యంలో వారు విధులకు దూరమై వేతనాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో శాఖాపరమైన విచారణలో డ్రైవర్ తప్పు లేదని నిర్ధారణ అయిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ విధులు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. అర్హులైన డ్రైవర్ల లైసెన్సుల పునరుద్ధరణ కోసం సంబంధిత డిపో, యూనిట్ అధికారులు ప్రాంతీయ రవాణా అధికారులకు లేఖలు పంపాలని ఆదేశించింది.
మూడు నెలల వరకు లైసెన్స్ సస్పెన్షన్ ఉన్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించేందుకు డీపీటీఓలు అనుమతి ఇవ్వవచ్చు. మూడు నెలలకు మించి సస్పెన్షన్ ఉన్న సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు లేదా జోనల్ అధికారులు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ విధులు నిర్వహించే కాలానికి డ్రైవర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయడంతో పాటు వారి సేవలను సంస్థ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
