-తొలిసారిగా ఒకే తరహాలో 64 కేంద్రాల నిర్మాణం
-525 చదరపు అడుగుల్లో ఆకర్షణీయమైన ఆకృతిలో వసతులు
-రూ.12.80 కోట్ల వ్యయం.. ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్తగా మరికొన్ని చర్యలు చేపట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో 64 ఆయుష్ వైద్య కేంద్రాలను (డిస్పెన్సరీలను) ఆధునిక వసతులతో తీర్చిదిద్దనుంది. జాతీయ ఆయుష్ మిషన్ 2026–27 వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ పనులకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.12.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. దెబ్బతిన్న పాత భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయడంతోపాటు, అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మిస్తారు. అన్ని కేంద్రాల్లోనూ ఒకే తరహా భవన నమూనా, ఒకే స్థాయి వసతులు కల్పించనున్నారు. రోగులు వేచి ఉండేందుకు ప్రత్యేక గది, వైద్యులు పరీక్షించేందుకు మరో గది, మందుల నిల్వకు ప్రత్యేక విభాగం, రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రయోగశాల ఏర్పాటు చేస్తారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, భద్రత వంటి సదుపాయాలను కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్కు ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వివరించారు.
కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయుష్ కేంద్రాల భవనాలు దెబ్బతినడం, రోగులకు అవసరమైన వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల వైద్యులు విధులు నిర్వహించేందుకు కూడా సరైన గదులు లేవు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆయుష్ శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. భవనాల పరిస్థితి, మరమ్మతుల అవసరం, అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించి అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన 64 కేంద్రాలను ఎంపిక చేసింది. వీటిలో 33 కేంద్రాలకు ఇప్పటికే స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 31 కేంద్రాలకు స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
అన్ని కేంద్రాలకూ ఒకే భవన నమూనా
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయుష్ కేంద్రాల్లో ఒకే రకమైన వసతులు ఉండేలా ప్రత్యేక భవన నమూనాను రూపొందించారు. ఆయుష్ శాఖ, ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ నిపుణులు కలిసి ఈ నమూనాను సిద్ధం చేశారు. జాతీయ ఆయుష్ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఒక్కో కేంద్రాన్ని 48.75 చదరపు మీటర్ల (సుమారు 525 చదరపు అడుగులు) విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఒకే అంతస్తులో రోగులకు అవసరమైన అన్ని విభాగాలు ఉండేలా రూపకల్పన చేశారు.
రోగులు వేచి ఉండేందుకు విశాలమైన గది
ఈ గదిలో రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేస్తారు. రద్దీ లేకుండా ప్రశాంతంగా వేచి ఉండేందుకు వీలుగా తీర్చిదిద్దుతారు. ఆరోగ్య పరిరక్షణ, యోగా, మంచి అలవాట్లపై అవగాహన కల్పించే దృశ్యాలను ప్రదర్శించేందుకు తెర ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అలాగే వైద్యులు రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక గది ఉంటుంది. ముఖ్యంగా మహిళా రోగుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేక అద్దాల విభజనలు, పరీక్షల కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అవసరమైతే గాలి చల్లబరిచే పరికరం అమర్చుకునేందుకు విద్యుత్తు సదుపాయం కల్పిస్తారు.
వేర్వేరుగా గదులు
ప్రత్యేక గదిలో ఆయుర్వేదం, హోమియోపతి, యునాని మందులను భద్రపరుస్తారు. మందులను క్రమపద్ధతిలో అమర్చేందుకు ప్రత్యేక అరలు, నిల్వ వేదికలు ఏర్పాటు చేస్తారు. అవసరమైన మందులను సులభంగా గుర్తించి రోగులకు అందించేందుకు వీలుగా ఈ విభాగాన్ని తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ప్రయోగశాల పరీక్షల కోసం ప్రత్యేక గదిని సిద్ధం చేస్తారు. ప్రతి కేంద్రంలో వైద్యుల గదికి అనుసంధానంగా ఒకటి, రోగులు, సందర్శకుల కోసం మరొకటి చొప్పున రెండు మరుగుదొడ్లు నిర్మిస్తారు. నిరంతర నీటి సరఫరా కోసం బోరుబావి, మోటారు ఏర్పాటు చేస్తారు. విద్యుత్తు తీగలు, ఫ్యాన్లు, మురుగునీటి పారుదల, సెప్టిక్ ట్యాంకు వంటి వసతులు కల్పిస్తారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక పరికరం అందుబాటులో ఉంచుతారు.
జిల్లాల వారీగా
జిల్లాల వారీగా చూస్తే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8 కేంద్రాలు నిర్మాణాలు జరగనున్నాయి. పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఐదేసి కేంద్రాలు, కోనసీమ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో నాలుగేసి, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాల్లో మూడేసి కేంద్రాలు, శ్రీకాకుళం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో రెండేసి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున నిర్మాణం జరగనుంది.
