యువ సంగీత ప్రతిభకు జాతీయ వేదికగా ‘AIR రైజింగ్ స్టార్స్ – సీజన్ 1’

-నవంబర్ 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక సంగీత కచేరీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యువతలో సంగీతాభిరుచిని పెంపొందించడంతో పాటు, యువ సంగీత కళాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించేందుకు ఆకాశవాణి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆకాశవాణి రైజింగ్ స్టార్స్ – సీజన్ 1’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థాన వేడుకల్లో భాగంగా నవంబర్ 15 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 26 కేంద్రాల్లో ప్రత్యేక యువ సంగీత కచేరీలను ఏర్పాటు చేసింది.
30 సంవత్సరాల లోపు యువ కళాకారుల్లోని సంగీత ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా శాస్త్రీయ, లలిత, భక్తి, జానపద సంగీత సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎంపిక చేసిన సంగీత ప్రదర్శనలను ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆకాశవాణి ఆర్కైవ్స్‌లో భద్రపరచనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం గత 15 రోజులుగా 20కి పైగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వివిధ సంగీత పోటీలను నిర్వహించింది. వీటిలో 1,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నవంబర్ 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పోటీల్లో 100 మందికి పైగా చిన్నారులు తమ సంగీత ప్రతిభను ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక యువ సంగీత కచేరీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంగీత విభాగాల్లో యువ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు.
యువతలో సంగీతంపై ఆసక్తిని పెంపొందిస్తూ భారతీయ సంగీత వారసత్వాన్ని భావితరాలకు చేరువ చేయడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమ విభాగాధిపతి, సహాయ నిర్దేశకురాలు జి. దివ్య తెలిపారు. నగర ప్రజలు, సంగీతాభిమానులు, ఆకాశవాణి శ్రోతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాశవాణి విజయవాడ కేంద్ర అధిపతి, రీజనల్ ఛానల్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంజినీరింగ్) ఎం. సోమేశ్వరరావు కోరారు.