-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-277 వార్డు సచివాలయాల పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలనకు గడప గడపన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 63 వ డివిజన్ 277 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. శాలువలతో ఘనంగా సత్కరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,877 గృహాలలో, 272 ఇళ్లను మల్లాది విష్ణు సందర్శించి.. నాలుగేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి కుటుంబానికి అందించిన లబ్ధి గూర్చి బుక్ లెట్ల ద్వారా వివరించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి అమలు చేశామా..? లేదా..? అని అడిగిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. కనుకనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.
ఆడపడుచులకే అగ్రతాంబూలం
పర్యటనలో భాగంగా చేయూత లబ్ధిదారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు ముచ్చటించారు. ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చేయూత పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని 10,875 మంది అక్కచెల్లెమ్మలకు మూడు విడతలలో రూ. 43 కోట్ల 38 లక్షల లబ్ధి చేకూర్చగా.. సచివాలయ పరిధిలో 228 మంది ఖాతాలలో రూ.1.01 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాయంతో కూరగాయలు, పచ్చళ్లు, చీరలు, బొమ్మలు వంటి వ్యాపారాలు ప్రారంభించినట్లు గడప గడపకు మన ప్రభుత్వంలో మహిళలు వివరిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ నగదుకు అనుబంధంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని తమ ఆర్థిక పురోభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.
చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్ లే
చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన ఖాళీ కూర్చీలకు ఉపన్యాసం ఇవ్వడానికే సరిపోయిందని మల్లాది విష్ణు విమర్శించారు. ఆ ఫ్రస్టేషన్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. ముఖ్యమంత్రిని ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష నేత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్ లేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విమర్శించారు. ఈఎస్‌ఐ, అమరావతి, స్కిల్ డెవలప్ మెంట్‌లో జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని ఆరోపించారు. అలాగే ఆయన పీఏపై జరిగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.2 వేల కోట్ల బాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదరపరని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అద్భుత పాలన అందిస్తున్నారని.. కానీ 4 సార్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఇంకో ఛాన్స్ అడుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఆర్ఐలు ప్రసాద్, సరత్, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు, నాగలక్ష్మి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …