-మోటారు వాహనాల రద్దు సామాగ్రి నుంచి శిల్పాలను తయారు చేస్తున్న వైనం
-“కళ ప్రజలను ప్రేరేపించగలదు, కళ చాలా శక్తివంతమైన ఆయుధం”:శ్రీనివాస్ పడకండ్ల
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీనివాస్ పడకండ్ల వ్యర్థ వాహనరద్దు సామగ్రితో అందమైన శిల్పాలు మలుస్తున్నారు. వారు తయారుచేసిన నమూనాలు అనేక నగరాల్లో ప్రదర్శితమై ఉన్నాయి. విజయవాడలోని మారుతీ నగర్ నివాసి, శ్రీ శ్రీనివాస్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి1998లో శిల్పకళలో ఫైన్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శ్రీనివాస్ 2007నుంచి2010 వరకు హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు. “మన్ కీ బాత్” 99 ఎపిసోడ్లలో ప్రధానమంత్రి ప్రస్తావించిన భారతదేశవ్యాప్తంగా వంద మందికి పైగా విశిష్ట వ్యక్తులలో శ్రీనివాస్ పడకండ్ల కూడా ఉన్నారు. 27 ఏప్రిల్ 2023న న్యూ ఢిల్లీలో జరిగిన “మన్ కీ బాత్” సమ్మేళనం సందర్భంగా ఇప్పటివరకూ వెలుగులోకి రాని హీరోలు PIBతో సంభాషిస్తున్నారు.
శ్రీనివాస్ జంతువులు, ఇతర కళారూపాల శిల్పాలను ఎక్కువగా ఆటోమొబైల్ ఇనుపరద్దుని ఉపయోగించి ఆర్థిక, పర్యావరణ అనుకూల పద్ధతిలో రూపకల్పన చేస్తున్నారు. తాను కళాశాలలో చదువుతున్న సమయంనుంచేవ్యర్థపదార్థాలను వినియోగించి శిల్పాల తయారీ చేస్తున్నట్లు తెలిపారు. తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పరిసరాల్లో పడిఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఏదైనా ప్రయోజనకర కళాకృతుల్ని చేయాలనుకుని ప్రారంభించానని శ్రీనివాస్ చెబుతున్నారు. తన సంకల్పానికి తన కుటుంబం, విశ్వవిద్యాలయ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ఎంతో సహకరించాయని చెప్పారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో ప్రసారంలో తాను చేసిన కృషికి ప్రధానమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నానని, ప్రధానమంత్రి ప్రశంసిస్తూ, సామాన్యుల విశిష్ట ప్రయత్నాలనుఈ విధంగా గుర్తించడం నిజంగా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని ప్రస్తావన తర్వాత, శ్రీనివాస్ ప్రయత్నం, కృషి పట్ల సమాజం వైఖరి మారింది. ఇప్పుడు అతను తన శిల్ప తయారీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నాడు. రాబోయే విద్యార్థులకు ఈ విశిష్టమైన కార్యక్రమం గురించి బోధించాలని, తద్వారా వారు సమాజ అభివృద్ధికి దోహదపడతారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి కొంత గుర్తింపు, భావవ్యక్తీకరణ ఉండాలని, దానిని ప్రదర్శించేందుకు మన్ కీ బాత్ వంటి అనువైన వేదికలు ఉండాలని దేశంలోని యువత శిల్పాల తయారీ వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు. కళ సులభంగా ప్రేరేపించగలదని, కళ చాలా శక్తివంతమైన ఆయుధమని ఆయన అన్నారు.
Prajavartha Online Telugu News