-భారతదేశపు వ్యాక్సీన్ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన వేదాల్లో చాలా సైన్స్, అనంత విజ్ఞానం దాగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని టాన్జరిన్ గ్రాండ్, హోటల్ లెమన్ ట్రీ ప్రిమియర్ లో రచయిత, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ రచించిన “భారతదేశపు వ్యాక్సీన్ చరిత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎస్ డా. కె.ఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ వేదాలంటే మంత్రాలు మాత్రమే కాదని అనేక అంతుపట్టని వ్యాధులకు నివారణ చికిత్స విధానాలు సైతం వాటిల్లో ఉన్నాయని, అధర్వణ వేదంలో వ్యవసాయం ఏ విధంగా చేయాలో విపులంగా ఉందని తెలిపారు.ఇప్పటి వరకు ప్రాశ్చాత్య దేశాలు కనిపెట్టిన ఆవిష్కరణలు సైతం మన వేదాల్లో నిక్షిప్తం కాబడి ఉన్నాయన్నారు.
రేబిస్ వ్యాధి సోకితే గతంలో మరణం తథ్యం అన్న పరిస్థితి ఉండేదని, కానీ నేడు రేబిస్ వ్యాక్సిన్ రావటంతో ప్రాణభయం నుంచి బయటపడటం జరుగుతుందన్నారు. లూయి పాశ్చర్ మొదట జీవశాస్త్ర శాస్త్రవేత్త కాదని, కానీ ఆ రంగంపై ఆసక్తితో జీవశాస్త్రంపై పట్టు సాధించి కొన్ని రకాల బ్యాక్టిరియాల వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని లోకానికి చాటి చెప్పాడని గుర్తుచేశారు. నేటి యువత ఆసక్తి ఉన్న రంగంలో సాధన చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. కోవిడ్ – 19 మొదటి దశ, రెండవ దశలో ప్రపంచం ఎంతో నష్టాన్ని చవిచూసిందని, రెండవ దశ లో వ్యాక్సిన్ లు రావటంతో ఊపిరిపీల్చుకోగలిగామన్నారు. వ్యాక్సిన్ ల చరిత్ర వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని, నేడు భారతదేశం స్వంతంగా వ్యాక్సిన్లు తయారు చేయటంలో మన శాస్త్రవేత్తల కృషి అద్వితీయమన్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డకు 5,6 టీకాలు వేయిస్తున్నామని దీంతో ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఇదంతా శాస్త్రవేత్తల ఆవిష్కరణల అద్భుత ఫలితమేనన్నారు. నేటి తరం పిల్లలందరికి ఉద్యమంలా పోలియో చుక్కలు వేయించటం ద్వారా పోలియో మహమ్మారిని సమర్థవంతంగా భారతదేశం ఎదుర్కోగలిగిందన్నారు.
పుస్తక రచయిత డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ – 19 సమయంలో భారత ప్రభుత్వ యంత్రాంగం, శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారని, ఈ రోజు ప్రపంచానికి ఆదర్శంగా మన దేశం నిలిచినందుకు గర్విస్తున్నామన్నారు. దేశంలోని అనేక మంది ఐఎఎస్ సహచరులు కోవిడ్ – 19 సమయంలో ఆ మహమ్మారిని ఎదుర్కోవటానికి చేసిన కృషి తనకు ప్రేరణ ఇచ్చిందన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వాడే వ్యాక్సిన్లలో 60 శాతం భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్రపంచానికి తెలిసిన విషయం ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త 1976 లో మొదటగా వ్యాక్సిన్ కనుగొన్నారని కానీ మన దేశ వైద్య చరిత్రను తరచి చూస్తే క్రీస్తు పూర్వం 325 సంవత్సరాలకు ముందే వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయం తెలుస్తుందన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగులో ఈ పుస్తకం ముద్రించిన అలకనంద పబ్లిషర్స్ అధినేత డి. అశోక్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ మాట్లాడుతూ సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా విపులంగా పుస్తకం రాయటం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. కోవిడ్ – 19 సమయంలో ప్రపంచ దేశాల్లో మృతుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉందని, కానీ మన భారతదేశంలో ఆ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషి వర్ణనాతీతమన్నారు.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇప్పటికీ ఆయన నిత్య విద్యార్థే అని కొనియాడారు. ఐఏఎస్ అయిన తరువాత ఎంబీఏ, మాస్టర్స్, లండన్ లో పిహెచ్‌డి చేశారన్నారు. భారతదేశపు వాక్సీన్ చరిత్ర పుస్తకం దేశంలోని అన్ని భాషల్లోకి అనువదిస్తున్నారని చెప్పారు.
ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ వ్యాక్సిన్ల చరిత్రపై ఎంతో శోధించి మరీ పుస్తక రూపంలో అందించటం గొప్ప విషయమన్నారు. వ్యాక్సిన్ ల రూపకల్పనలో భారతదేశం పైచేయి సాధించటం గర్వకారణమన్నారు.
మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ విభాగం ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకం రాయటంలో డాక్టర్ సజ్జన్ సింగ్ యాదవ్ ది ప్రత్యేక శైలి అన్నారు. భారతదేశం వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయగలిగే స్థితిలో ఉండటం గర్వకారణమన్నారు.
వక్తల ప్రసంగం అనంతరం భారతదేశపు వ్యాక్సీన్ చరిత్ర పుస్తకాన్ని సీఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రచయిత సజ్జన్ సింగ్ రావత్ ను ముఖ్య అతిథులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.