– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 246 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి, సంక్షేమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రాన నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేవీనగర్ లో విస్తృతంగా పర్యటించి 166 గడపలను సందర్శించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను లబ్ధిదారులకు వివరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన వాటన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.20 కోట్ల సంక్షేమం
నవరత్నాల కార్యక్రమాల ద్వారా సచివాలయ పరిధిలో అక్షరాలా 4 కోట్ల 20 లక్షల 52 వేల 154 రూపాయల సంక్షేమాన్ని నాలుగేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 275 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 264 మందికి రూ. 34.32 లక్షలు., ఆసరా ద్వారా 476 మందికి రూ. 63.84 లక్షలు., సున్నావడ్డీ ద్వారా 333 మందికి రూ. 7.03 లక్షలు., చేయూత ద్వారా 74 మందికి రూ. 13.87 లక్షలు., విద్యాదీవెన-వసతీదీవెన ద్వారా 106 మందికి రూ.14.02 లక్షలు., వాహనమిత్ర ద్వారా 21 మందికి రూ. 2.10 లక్షల ఆర్థిక సాయాన్ని కేవలం ఒక్క ఏడాదిలోనే అందజేసినట్లు వివరించారు. అలాగే పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 297 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
సర్వేలన్నీ మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారని చెబుతున్నాయి
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని మల్లాది విష్ణు అన్నారు. సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రతి సర్వేలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో మహిళలు ముందున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అది చూసి ఓర్వలేక చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పనిగట్టుగుని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతూ.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని.. కేవలం దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా ఆయన పాలన సాగిందన్నారు. మళ్లీ సీఎం అయితే పేదల్ని కోటీశ్వరులను చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎందుకు పేదలను కోటీశ్వరులను చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ స్థాయి జీరోకి పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు సామంతకూరి దుర్గారావు, తుంపాల వరప్రసాద్, మీసాల శ్రీను, టి.ముత్యాలరావు, జి.దుర్గారావు, అమ్ముల రవికుమార్, ముద్రబోయిన దుర్గారావు, మనోహర్, ప్రసాద్, విశాలాక్షి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.