విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ (ఇన్‌కాయిస్), దేశంలోని తూర్పు-పశ్చిమ తీరాలను కలుపుతూ 5 భారీ కార్యశాలలు నిర్వహిస్తోంది. వీటిలో మొదటి కార్యశాల జులై 7, 2023న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జరుగుతుంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం, దేశ ప్రజలు, సంస్కృతి, విజయాల అద్భుత చరిత్రను మననం చేసుకోవడానికి, వేడుకగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తోంది.
మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, తీర ప్రాంత నిర్వహణ & విపత్తుల నిర్వహణలో పాల్గొనే ప్రభుత్వ సంస్థలు, నౌకా పరిశ్రమ, చమురు & సహజ వాయువు పరిశ్రమ, భారత నౌకాదళం, తీర రక్షణ దళం, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు వంటి వివిధ వర్గాలకు సముద్ర పరిస్థితి, హెచ్చరికలు, సూచనలు వంటి సమాచారాన్ని ఇన్‌కాయిస్ అందిస్తుంది. దేశాభివృద్ధి కోసం సముద్ర వనరులను అన్వేషించడానికి, ఉపయోగించుకోవడానికి, ఆర్కిటిక్, అంటార్కిటిక్, హిమాలయాలను అన్వేషించడానికి వాతావరణం, సముద్రం, తీర ప్రాంత పరిస్థితి, జలశాస్త్రం, భూకంప శాస్త్రం, ప్రకృతి విపత్తుల హెచ్చరికలకు సంబంధించిన సేవలను అందించడం తప్పనిసరి.
కేంద్ర భూ విజ్ఞాన శాఖ (ఎంవోయీఎస్) మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు, ప్రముఖులు, మత్స్యకార్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సీఐఎఫ్‌టీ, సిఫ్‌నెట్, ఎఫ్‌ఎస్‌ఐ, ఇన్‌కాయిస్, ఎన్‌ఐఎఫ్‌పీహెచ్‌ఏటీటీ, ఎంవోఎఫ్, ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ వంటి వివిధ సంస్థల శాస్త్రవేత్తలు చేపల వేట, సముద్రం లోతుల్లో ఉన్న చేపలు పట్టడం, పర్యావరణ వ్యవస్థ, సముద్ర సేవలు మొదలైన అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. మత్స్యకార్ల జీవనోపాధి, భద్రతకు సాయం చేయడం, వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది, మత్స్యకార్ల భవిష్యత్ తరం సామర్థ్యాన్ని, మత్స్య రంగంలోకి అడుగు పెట్టే విద్యార్థుల సంఖ్యను పెంచుతుంది.