-విజయవాడలో మొక్కల్ని నాటిన ఐసోవా
-రాష్ట్ర వ్యాప్తంగా 7.96 లక్షలకు పైగా మొక్కల పెంపకానికి శ్రీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ పరిరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో డిఓడబ్ల్యుఎ (డిస్టిక్ట్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్) సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 2 లక్షల 22 వేల 222 మొక్కల్ని నాటి బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలోనూ, 2 లక్షల మొక్కల్ని నాటి చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి. ఐసోవా అధ్యక్షురాలు శ్రీమతి పద్మప్రియా జవహర్ రెడ్డి, కార్యదర్శి శ్రీమతి పద్మవల్లీ కృష్ణబాబు, సంయుక్త కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి అరుణ్ కుమార్, కోశాధికారి శ్రీమతి హేమా మురళీధర్ రెడ్డి లతోపాటు ఆరుగురు కోర్ కమిటీ సభ్యులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక్కొక్క సభ్యురాలు 3 నుండి 4 జిల్లాలను ఎంపిక చేసుకుని డిఓడబ్ల్యుఎ తో సమన్వయం చేసుకోవడం ద్వారా మొక్కల్ని నాటే కార్యక్రమానికి నాంది పలికారు. ఐసోవా అధ్యక్షురాలు శ్రీమతి పద్మప్రియా జవహర్ రెడ్డి సూచనలు, సలహాల మేరకు సమాజానికి ఫలాలనిచ్చే మామిడి, కొబ్బరి, నేరేడు, చింత, జామ, సీతాఫలం వంటి మొక్కల్ని, నీడను, ఆక్సిజన్ ను అందించే రావి, వేప, మారేడు, గానుగ వంటి మొక్కల్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 7.96 లక్షలకు పైగా మొక్కల్ని నాటించారు. ప్రత్యేకంగా విజయవాడ నగరంలో ఐసోవా వారు మధురానగర్ వద్ద, బుడమేరు గట్ల మీద వంద మొక్కల్ని, ప్రభుత్వ సిద్ధార్ధ వైద్య కళాశాల విజయవాడ ఆవరణలో 50 మొక్కల్ని నాటించి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని చాటుకున్నారు. అంతే కాక ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ (ఐసోవా) కార్యాలయ ఆవరణలో వివిధ జాతుల మొక్కల్ని స్థానికులకు ఐసోవా సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు. మొక్కల్ని నాటేందుకు సిఆర్డీయే, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అందించిన సహకారం పట్ల ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.