మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి రైతులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ పిలుపునిచ్చారు. గురువారం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతు పాలడుగు సత్యనారాయణ పొలంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కలు నాటి మెగా ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుమునుపు అక్కడే సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించి దాని పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర వివరాలను సంబంధిత రైతు పాలడుగు రమేష్ చంద్రను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంచార్జ్ కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో 150 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటల పెంపక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వేలేరు గ్రామంలోనే 125 హెక్టార్లలో తోటల పెంపక కార్యక్రమం ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. రైతు రమేష్ చంద్ర తన తాతల కాలం నుండి వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ వివిధ రకాల పంటలను పండించడం అభినందనీయమన్నారు.
ఆయిల్ ఫామ్ తోటల సాగు సాగు కోసం ప్రభుత్వం అన్ని విధాల రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.
ఆయిల్ ఫామ్ తోటలను సూక్ష్మ సేద్యం కింద చేపట్టేందు కోసం ప్రభుత్వం 29వేల రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు.
అలాగే ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ కింద మరో 20 వేల రూపాయలను అందిస్తోందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుకు ముందుకు తరలిరావాలన్నారు.
రైతులకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి నెల మొదటి శుక్రవారం మండల స్థాయిలో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం జరిగే వ్యవసాయ సలహా మండలి సమావేశాలలో చర్చించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను రాష్ట్ర స్థాయిలో జరిగే వ్యవసాయ సలహా మండలి సమావేశం దృష్టికి తీసుకునివెళ్లడం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈసారి జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని ఈనెల మూడవ శుక్రవారం బాపులపాడు మండల కేంద్రంలో నిర్వహిస్తామన్నారు.
ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు మాట్లాడుతూ వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.
వ్యవసాయం లాభసాటిగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రైతుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
దేశంలో ఆహార కొరత వస్తుందనే ప్రభుత్వం విదేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతులు నిలిపివేసిందన్నారు.
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని, నిల్వ ఉండే పండ్ల రకాలను వారు అభివృద్ధి పరచాలని కోరారు.
విజయవాడ ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం డిడి ధర్మజా ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో పాటించవలసిన మెలకువలు రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి, జిల్లా సూక్ష్మ సేద్య అధికారి విజయలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారులు హరిచంద్ర, చందు జోసెఫ్ అభ్యుదయ రైతులు శర్మ, జిల్లా ఆయిల్ పామ్ సంఘం కార్యదర్శి రాజగోపాలకృష్ణ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మేనేజర్ శరత్ బాబు తదితర అధికారులు, ఉద్యాన శాఖ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.