-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో నలుగురికి మంజూరైన రూ. 2.41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో శనివారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్యశాఖను వెంటిలేటర్ పై ఉంచారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శాఖకు జీవం పోశారని తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, 104 వాహనాల ద్వారా ప్రతి గడపకూ అత్యాధునిక వైద్యం అందుతోందన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.16,852 కోట్లతో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,257 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాగా.. కార్డు ద్వారా రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసాని కల్పించడం చారిత్రాత్మకమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని వెల్లడించారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో 980 మందికి రూ. 7 కోట్ల 44 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 92 మందికి రూ. 2 కోట్ల 68 లక్షల 73 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 9 కోట్ల 69 లక్షల 17 వేల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుని కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News