ప్రతి రెండు, మూడునెలలకు కుప్పం వస్తా…

– మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
– ఏ సమస్య ఉన్నా..పరిష్కారానికి సత్వర చర్యలు
– అధికారం శాశ్వతం కాదు…మీ ప్రేమాభిమానాలు శాశ్వతం
– కమ్మగుట్టపల్లి మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య

కుప్పం, కమ్మగుట్టపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారం శాశ్వతం కాదు..అధికారం ఉందని, మీరు చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారని ఇక్కడకు నేను రాలేదు. మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదోఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా గుడిపల్లి మండలం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, ఓటరుకు భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…వై నాట్ 175 అన్నవాళ్లకు రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అరాచకాలు, దౌర్జన్యాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వారికి ప్రజలు మౌనంగా ఓటుతో సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ సత్యం, ధర్మం, నిజాయితీ, నిజమే గెలుస్తుందని రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో రుజువు చేశారు. కుప్పం ప్రజలు తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎంత వేధించినా, ఎంత భయపెట్టినా ఎవరికీ తలొగ్గకుండా ధైర్యంగా నిలబడి టీడీపీ జెండాను ఎగరేశారు. చంద్రబాబును 53రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు కుప్పం మహిళలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు చూపించిన చొరవ నాలో కదలిక తీసుకొచ్చింది. ఆ ధైర్యంతోనే నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను. ఆ పర్యటనలో చంద్రబాబుపై మహిళలకు ఉన్న అభిమానం, ఆప్యాయత తెలుసుకున్నాను. నేను నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా కుప్పం వచ్చినప్పుడు ఇక్కడి మహిళలు నన్ను ఓ ఆడపడుచులా ఆదరించారు. ఆ సమయంలో వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలే నన్ను మరోసారి ఇక్కడికి తీసుకొచ్చాయి. చంద్రబాబుతో పనిలేకుండా ప్రతి రెండు, మూడు నెలలకు నేను కుప్పం వస్తాను. కుప్పం ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుంటాను. వాళ్లకు నేను చేయగలిగిన సాయం చేస్తాను. ఎన్నికల ప్రచారం సమయంలో నేను చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గానికి 3 పెద్ద పరిశ్రమలు తెచ్చి, ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చంద్రబాబును ఒప్పిస్తాను. చంద్రబాబు కూడా ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన హామీలకు మించి కుప్పం ప్రజలకు మేలు చేస్తారు. నారా లోకేష్ కుప్పం గడ్డ మీద నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో మీరు ఇచ్చిన ధైర్యం, చూపిన అభిమానంతో లోకేష్ తన పాదయాత్రను ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడి, పోరాడి విజయవంతంగా పూర్తిచేశారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నావంతు నేను కూడా కుప్పం ప్రజలకు చేతనైన సహాయ,సహకారాలు అందిస్తాను. కుప్పం ప్రజలకు నేను, నా కుటుంబం అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మాట ఇస్తున్నాను..అని భువనేశ్వరి అన్నారు.
ఈ సందర్భంగా మహిళలు తమకు ఉన్న సమస్యలను భువనేశ్వరికి వివరించారు.

లక్ష్మీదేవి, కమ్మగుట్టపల్లి:- మా కుటుంబానికి ఉన్న 1.70ఎకరాలను మునిస్వామి, మునియప్ప అనే వ్యక్తులు కబ్జా చేశారు. మేము వారికి పొలం అమ్మకుండానే అమ్మేశామని మమ్మల్ని మోసం చేసి, వేధిస్తున్నారు. పెద్దలతో, అధికారులతో అడిగిస్తే కోర్టు ద్వారా అడగండి, లేదంటే డబ్బులు చెల్లిస్తేనే పొలం ఇస్తానని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మాకు మీరే న్యాయం చేయాలి.
భువనేశ్వరి:- మీ వద్ద ఉన్న ఆధారాలు నాకు ఇవ్వండి. అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేపిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పాలనలో పేదవారి భూములు కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి వారందరికీ ప్రత్యేక కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కంకణబద్దులై ఉన్నారు. ధైర్యంగా ఉండండి…న్యాయం జరుగుతుంది.

ఉమ, జాతిరత్నంపల్లి:- మా గ్రామాన్ని 15 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం కావడం లేదు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగడం లేదు. అభివృద్ధి పనులు మా గ్రామంలో ఏమీ జరగడం లేదు. మీరు మా గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారా?
భువనేశ్వరి:- చంద్రబాబుకు, నాకు కుప్పం ప్రజలపై ప్రేమ, అభిమానం ఒకేలా ఉంటుంది. ఒక గ్రామం ఎక్కువ, ఒక గ్రామం తక్కువ అనేది లేదు. అభివృద్ధి అవసరమైన ప్రతి గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. మీ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *