మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాంజలి పోర్టల్ లో పాఠశాలకు అవసరమైన సేవలు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పనుల పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాంజలి పోర్టల్ లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థుల చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈ -మెయిల్ అడ్రస్ లు అన్నీ కూడా సేకరించాలన్నారు. పూర్వ విద్యార్థుల ద్వారా ఆయా పాఠశాలలకు అవసరమైన వసతులు సేవలు సమకూర్చునేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పోషకాహార పెరటి తోటలో పెంపక కార్యక్రమం 100 పాఠశాలలకు గాను 83 పాఠశాలల్లో ప్రారంభించడం శుభసూచకమని, మిగిలిన పాఠశాలల్లో కూడా సత్వరమే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు అందరూ వారి పాఠశాలల రోజువారి పురోగతిని ఫోటోలు తీసి వాట్స్అప్ గ్రూప్లో పంపాలన్నారు. నా మొక్క నా బాధ్యత పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా నాటిన ప్రతి మొక్కకు ఒక విద్యార్థి పేరు పెట్టి ఆ విద్యార్థికి ఆ మొక్క పైన ఆత్మీయబంధం కలిగే విధంగా చూడాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో సజావుగా అమలయ్యేలా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా మండల విద్యాధికారులు ప్రతిరోజు పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన రుచి చూడాలని అవసరమైతే ప్రధానోపాధ్యాయులకు, వంట ఏజెన్సీలకు సూచనలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు అనుసరించి మెనూ ప్రకారం భోజనం ఉంటుందా లేదా గమనించడంతోపాటు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం,మంచినీటి సరఫరా సిబ్బందికి విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి రంగులు వేశారా లేదా నల్ల బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, ప్రహరీలు, వంటశాలలు, అదనపు తరగతులు ఉన్నాయా లేదా గమనించుకొని లేని వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
మనబడి మన భవిష్యత్తు కింద జిల్లాలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాడకం నీరుకు సంబంధించి 311పనులకు గాను 223 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 88 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. అలాగే వంటశాలలకు సంబంధించి 238 పనులు మంజూరు కాగా 155 పనులు పూర్తయ్యాయని, 83 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు చిన్న పెద్ద మరమ్మతులకు సంబంధించి 580 పనులు మంజూరు కాగా అందులో 414 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 166 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. విద్యుద్దీకరణకు సంబంధించి 311 పనులు మంజూరు కాగా 199 పనులు పూర్తయ్యాయని మిగిలిన 112 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి 104 పనులు మంజూరు కాగా అందులో 40 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 64 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డి ఈ ఓ తహెరా సుల్తానా, సర్వ శిక్ష ఏ పి సి శ్రీరాములు నాయక్, ఆర్ఐ ఓ రవికుమార్, డిఐఈఓ పి.బి. సాల్మన్ రాజు ఉపవిద్యాధికారులు పద్మారాణి, శేఖర్ సింగ్ సర్వ శిక్ష సెక్టోరల్ అధికారులు సుభాని, రాంబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.