-ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి కీలకంగా పని చేసిన ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధులు ఇక నుండి 2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయాలని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసిన ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధులతో ఆయన కాసేపు మాట్లాడారు. తమ బృందం ఎన్ ఆర్ ఐ టెక్ బ్రెయిన్స్ పేరుతో 2024 ఎన్నికల సమయంలో చేసిన కృషి గురించి మంత్రి అనగానికి వివరించారు. తాము రాత్రింబవళ్లు కష్టపడి 175 నియోజకవర్గాలకు కావాల్సిన సమాచారాన్ని అందించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో బూతుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేశామని, బూతుల వారీగా దొంగ ఓట్లను తొలగించేందుకు కృషి చేశామని చెప్పారు. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా తయారుచేసేందుకు ఎన్నికల సంఘంతో కలిసి కూడా పని చేసినట్లు చెప్పారు. కూటమి అభ్యర్ధుల గెలుపుకోసం కోటి 80 లక్షల మందికి వాట్సాప్ మేసేజ్లు పంపినట్లు చెప్పారు. ఎన్ ఆర్ ఐ టీడీపీ సభ్యులు ఎంతో శ్రమకొర్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడ్డారని, వారి సేవలు ఎప్పటికీ మరవబోమని మంత్రి అనగాని అన్నారు. కాగా ఇక నుండి 2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయాలని కోరారు. అదే లక్ష్యంతో గ్రీవెన్స్ యాప్ అనే ఒక అప్లికేషన్ను తాము రూపొందిస్తున్నట్లు ఎన్ ఆర్ ఐ టీడీపీ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి మంత్రి, ప్రతి నాయకుడు తమ వద్దకు వచ్చే వినతులను వేగంగా పరిష్కరించగలుగుతారని, తద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగి రానున్న ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందని ప్రతినిధులు కిరణ్ తుమ్మల, సూర్య తెలప్రోలు, మురళీ కోగంటి, తేజ్ మన్నవ, వల్లభనేని నాగేశ్వరరావు, యలమంచలి వెంకట్, మనోజ్ లింగా తెలిపారు.