మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి భూ సమస్యలకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములకు నష్టపరిహారం చెల్లింపు, ల్యాండ్ అలినేషన్, 22ఏ భూముల తొలగింపు, గన్నవరం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టు, భారత సాల్ట్, మల్లవల్లి పారిశ్రామిక వాడల భూసేకరణ, సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ముఖ్యంగా కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వివాదాస్పద భూ సమస్యలను పరిష్కరించే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. భూములకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో వాస్తవ హక్కుదారులను గుర్తించాలన్నారు. మచిలీపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించిన 45 ఎకరాల అసైన్డ్ భూమి కోసం ఎల్ పి షెడ్యూల్డ్ వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ సమర్పించాలని, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిబంధనలను పాటించాలని కలెక్టర్ పోర్టు అధికారులకు సూచించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్ని లేఔట్లకు భూపరిహారం చెల్లించారు, ఇంకా చెల్లించాల్సినవి, పరిహారం చెల్లింపునకు ఉన్న సమస్యల వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ శ్రీదేవి, బందరు, గుడివాడ, ఉయ్యూరు రెవిన్యూ డివిజన్ల అధికారులు ఎం వాణి, పి పద్మావతి, డి రాజు, భూ రికార్డులు సర్వే ఏడి మనీషా త్రిపాటి, జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్, మచిలీపట్నం పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …